లేపాక్షి: కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో పేదరికం పెరిగిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సోమవారం లేపాక్షిలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ 12 సంవత్సరాల కాలంలో పేదలకు చేసిన మేలు శూన్యమన్నారు. వ్యవస్థలను అంగట్లో సరుకుల్లా కొనుగోలు చేసి ఆర్భాటం చేయడం సిగ్గుచేటన్నారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల 16 మంది విద్యార్థులు మరణిచండం బీజేపీ పాపమేనన్నారు. ఢిల్లీని గడగడలాడించి కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించడంలో యువత, విద్యార్థుల పాత్ర గొప్పదన్నారు. దేశవ్యాప్తంగా మతోన్మాదం పెరిగిపోయిందని విమర్శించారు. 2014లో రూపాయి విలువ పడిపోయిందని మాట్లాడిన మోదీ ప్రస్తుతం ఏ స్థాయిలో వుందో కళ్లు తెరిచి చూడాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల కడుపుకొట్టారన్నారు. అదానీ, అంబానీలే దేశ సంపదలో ముందున్నారని విమర్శించారు. మోదీ రాజకీయాలకు పనికిరాడని చెప్పిన చంద్రబాబు ఈ రోజున దేశానికి విశ్వగురువు అని మాట్లాడడం రాజకీయ స్వార్థమే అన్నారు. రాష్ట్రంలో భూకబ్జాలు, దందాలు, అధికార అరాచకాలు పెరిగి పోయాయని, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పులు ఎన్ని, చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసిన అప్పెంత అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 80 శాతం మంది ఎమ్మెల్యేలు అవినీతిలో మునిగి పోయారని ఆరోపించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జగదీష్, రామాంజినేయులు, రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కనిశెట్టిపల్లి వినోద్‌కుమార్, శివప్ప, మధు, నరసింహమూర్తి, రాజా, చలపతి నాయుడు, బాలస్వామి, వెంకటేష్, మండల కార్యదర్శి గౌతమ్‌కుమార్, నాయకులు కమల్‌భాషా, బాబు, చాంద్‌బాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెరిగిన అరాచకాలు
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ


