ధర్మవరం అర్బన్: పట్టణంలో లెన్స్‌కార్ట్ షోరూమ్ ఏర్పాటుతో స్థానిక ఆప్టికల్స్ నిర్వాహకులకు తీరని నష్టంం జరుగుతుందని ధర్మవరం ఆప్టికల్స్ అసోసియేషన్ యజమానులు, వామపక్ష నాయకులు మండిపడ్డారు. పట్టణంలోని సెరికల్చర్ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న లెన్స్‌కార్ట్ షోరూమ్ వద్ద సోమవారం ధర్నా చేశారు. పట్టణంలో దాదాపు 200 కుటుంబాలు ఆప్టికల్స్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. లెన్స్‌కార్ట్ లాంటి పెద్ద కార్పొరేట్ దుకాణాల కారణంగా చిరు వ్యాపారులు నష్టపోతారన్నారు. అభివృద్ధి పేరుతో చిన్న వ్యాపారాలను నాశనం చేయడం సరికాదన్నారు. ఇంత జరుగుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు నోరు మెదపకపోవడం దారుణమని వాపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షోరూమ్ వద్ద ధర్నా చేపట్టిన ఆప్టికల్స్ యజమానులు, నిర్వాహకులు, పీఎస్‌యూ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, సురేష్‌చౌదరిలకు టూ టౌన్ సీఐ జయనాయక్, ఎస్‌ఐ ఖాదర్‌భాష సర్దిచెప్పారు. మాట వినకపోవడంతో ధర్నా చేస్తున్న బలవంతంగా వారిని స్టేషన్‌కు తరలించారు. ధర్నాలో ఆప్టికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు గుడిపాటి సురేష్, శ్రీకాంత్, హరికృష్ణ, శివ, ఆసిఫ్, రాజు, పీఎస్‌యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, వినయ్‌కుమార్, పోలా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.


