ధర్మవరం అర్బన్: పట్టణంలో సోమవారం ముత్యాలమ్మ గ్రామోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీచెన్నకేశవపురంలోని మేడాపురం రోడ్డు సమీపంలో ఉన్న ముత్యాలమ్మకు సోమవారం నిర్వాహకులు నాయనిగారి నరసింహారెడ్డి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేక రథంపై ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పురవీధుల్లో ఊరేగించారు. గ్రామోత్సవంలో కళాకారులు నృత్యాలు, కోలాటాలు, చెక్కభజనలతో ఆకట్టుకున్నారు. పలువురు విచిత్ర వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అడుగడుగునా అమ్మవారికి భక్తులు పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పట్టణవాసులు తరలివచ్చారు. మంగళవారం ముత్యాలమ్మకు మహిళలు బోనాలు తీసుకెళుతున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు నరసింహారెడ్డి స్వామి తెలిపారు.


