అనంతపురం టౌన్: విద్యుత్ చార్జీలు పెంచబోమంటూనే చంద్రబాబు ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోంది. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో అల్లాడిపోతున్న ప్రజలపై డెవలప్‌మెంట్ చార్జీల పేరిట మరో భారం మోపింది. వినియోగం అధికంగా ఉందంటూ గృహ విద్యుత్ వినియోగదారులపై బిల్లుతోపాటు అదనంగా డెవలప్‌మెంట్ చార్జీలను కిలో వాట్‌కు రూ.2,350 చొప్పున బాదుతోంది. వినియోగాన్ని బట్టి కొంతమంది వినియోగదారులకు రెండు నుంచి మూడు కిలోవాట్లకు డెవలప్‌మెంట్ చార్జీల భారం వేస్తోంది. నెలవారీ బిల్లుతోపాటే డెవలప్‌మెంట్ చార్జీలు వసూలు చేసేందుకు శ్రీకారం చుట్టింది.
లక్ష మందిపై భారం
అనంతపురం జిల్లాలో 8.15 లక్షలు, శ్రీసత్యసాయి జిల్లాలో 6.79 లక్షల గృహ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఈ జూలై నెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష మంది వినియోగదారులకు పైగానే డెవలప్‌మెంట్ చార్జీల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మోపింది. ఒక్కో వినియోగదారునికి రూ.2,350 నుంచి రూ.8వేల వరకు డెవలప్‌మెంట్ చార్జీల పేరుతో షాక్ ఇచ్చింది. ఓ వైపు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ తీసుకువచ్చామంటూ విద్యుత్ శాఖ మంత్రి ఊదరగొడుతున్నారు. విద్యుత్ బిల్లుపై యూనిట్‌కు పైసల్లో తగ్గించి.. డెవలప్‌మెంట్ పేరిట వేలాది రూపాయాలు వసూళ్లు చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ నెల బిల్లుతోపాటే డెవలప్‌మెంట్ చార్జీలు చెల్లించాలని, లేకుంటే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామంటున్నారని వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డెవలప్‌మెంట్ చార్జీలను వేయాలని కోరుతున్నారు.
వినియోగం మేరకు చార్జీలు
విద్యుత్ వినియోగించిన మేరకే డెవలప్‌మెంట్ చార్జీల వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అధికంగా విద్యుత్ వినియోగించిన వినియోగదారులకు మాత్రమే చార్జీలు వేశారు. తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న వారికి డెవలప్ మెంట్ చార్జీలు వేసి ఉంటే.. అలాంటి వారు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. బిల్లుల చెల్లింపులో వినియోగదారులు విద్యుత్ ఉద్యోగులకు సహకరించాలి.
– శేషాద్రి శేఖర్, ఎస్‌ఈ, విద్యుత్ శాఖ
అనంతపురం రూరల్ మండలం తపోవనం శివాలయం దగ్గర ఉన్న ఈ షాపు రెండేళ్లుగా మూతపడింది. షాపు యజమాని ఈశ్వరమ్మ ప్రతి నెలా కరెంటు (సర్వీస్ నంబర్ 7111201048364) బిల్లు చెల్లిస్తోంది. విద్యుత్ వినియోగం లేని ఈ షాప్‌కు డెవలప్‌మెంట్ చార్జీలు రూ.4,550 చెల్లించాలంటూ బిల్లు జారీ చేశారు.
వినియోగం పెరిగిందని చార్జీల మోత
ఒక కిలో వాట్‌కు రూ.2,350 మేర
డెవలప్‌మెంట్ చార్జీ
ఇదేం బాదుడు
బాబోయ్ అంటున్న వినియోగదారులు
అనంతపురంలోని బళ్లారి రోడ్డు వేదగాయత్రి దేవాలయం దగ్గర నివాసముంటున్న వి.తేజానాయక్ ఇంటికి విద్యుత్ (సర్వీస్ నంబర్ 7111201208300) వినియోగం అధికంగా ఉందంటూ ఇప్పటికే అధికారులు రెండు పర్యాయాలు డెవలప్‌మెంట్ చార్జీలు వేశారు. ఈ జూలైలో మరోసారి డెవలప్‌మెంట్ చార్జీల కింద రూ.4,550 వేశారు. ఓ వైపు బిల్లు.. మరోవైపు డెవలప్‌మెంట్ చార్జీలబాదుడుతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.


