రొద్దం: మండల పరిధిలోని పెద్దమంతూరు పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం పెన్నానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నాలుగు ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
హిందూపురం: మండలంలోని అప్పలకుంట గేట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. హిందూపురం రూరల్ పోలీసుల వివరాలమేరకు.. సంతేబిదనూరుకు చెందిన ముబారక్ (30)తో పాటు మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై తూమకుంట నుంచి హిందూపురం వైపునకు వస్తున్నారు. అయితే అప్పలకుంట గేట్ వద్ద తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఘటనలో ముబారక్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన మరో వ్యక్తిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన ప్రదేశాన్ని హిందూపురం రూరల్ ఏఎస్‌ఐ శ్రీరాములు, సిబ్బంది పరిశీలించారు.
గొర్రెల కాపరి ఆత్మహత్య
డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డీ.హీరేహాళ్ మండలంలోని బాదనహాళ్ గ్రామ శివారులో గొర్రెల కాపరి బోయ శివరుద్ర (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాలమేరకు... శివరుద్ర గొర్రెలు మేపుతూ జీనవం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన, బాదనహాల్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పొలంలో వేపచెట్టుకు లుంగీతో ఉరివేసుకొని కనిపించాడు. విషయాన్ని గమనించిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. మృతుడి భార్య అమృత ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్‌కు తరలించారు. మృతుడి తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అనారోగ్యంతో మహిళ ..
రాప్తాడు రూరల్: అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాప్తాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పామిడి మండలం ఖాదర్‌పేటకు చెందిన లేట్ బుసా చంద్రశేఖర్‌రెడ్డి భార్య బుసా చంద్రకళ (50) ప్రస్తుతం రాప్తాడు మండలం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. పది రోజులుగా ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆహారం కూడా సరిగా తీసుకోలేకపోతున్నారు. దీంతో కుమార్తె బుసా వీర భార్గవి, మేనత్త ఉషారాణి కలిసి వివిధ ఆస్పతుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. మనస్తాపానికి గురైన చంద్రకళ శనివారం రాత్రి ఇంటి హాలులోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలాన్ని ఆదివారం పరిశీలించారు. భార్గవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
‘టెట్’కు హాజరయ్యే
టీచర్లకు ఓడీ ఇవ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: టెట్–2026 పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ (ఓడీ) సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాఖాపరమైన (డిపార్ట్‌మెంటల్) పరీక్షలకు హాజరయ్యే సమయంలో ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తోందని వారు గుర్తు చేశారు.


