భూతప్పల స్పర్శకోసం బోర్లా పడుకున్న భక్తులు
భక్తులపై కాలు మోపుతూ ముందుకు వస్తున్న భూతప్ప
మడకశిరరూరల్: ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆదివారం మినీ భూతప్ప ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తొలుత లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నవారు, సంతానం లేని మహిళలు తడి బట్టలతో భూతప్పలు వచ్చేదారిలో బోర్లా పడుకున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తూ భూతప్పలు భక్తులపై కాలుమోపుతూ ఆలయానికి చేరుకున్నారు. భూతప్పలు కాలుమోపితే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. భూతప్పల స్పర్శకోసం ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
అలంకరణలో లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయస్వామి


