సాగునీటి హక్కుల కోసం పోరాటం | - | Sakshi
Sakshi News home page

సాగునీటి హక్కుల కోసం పోరాటం

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): రాయలసీమ ప్రాంతానికి దక్కాల్సిన సాగు, తాగునీటి హక్కుల కోసం కలసికట్టుగా పోరాటాన్ని సాగిద్దామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. నీటి హక్కుల సాధన కోసం ఈ నెల 30న చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం ఆయన న్యామద్దలకు వెళ్లి పార్టీ నాయకులు, రైతులతో చర్చించారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా మన ప్రాంతానికి దక్కాల్సిన నీటిని దక్కకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. హంద్రీనీవా జలాల వాటా పెంచకపోవటంతో పాటు లైనింగ్‌ పనులతో ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టికొట్టారన్నారు. సాగు, తాగునీరు లేక ఈ ప్రాంత రైతులు, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేసేందుకు పాదయాత్రను చేపడుతున్నామన్నారు. న్యామద్దల సమీపంలోని హంద్రీనీవా కాలువపై 34 కి.మీ. రాయి వద్ద నుంచి ప్రారంభించే ఈ పాదయాత్రలో జిల్లాలోని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు, సమన్వకర్తలతో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరవుతున్నారన్నారు. పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ డోలా రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు న్యామద్దల రామకృష్ణారెడ్డి, వెంకటంపల్లి సత్యనారాయణరెడ్డి, ఎర్రోనిపల్లి చన్నప్పయ్య, ప్యాదిండి నరసింహారెడ్డి, చెన్నేకొత్తపల్లి ఎస్టీడీ శీనా, చిన్నా, ప్రకాష్‌, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

30న చలో న్యామద్దలను

విజయవంతం చేయండి

మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement