అనంతపురం సిటీ: జీవించినంత కాలమూ వృత్తినే దైవంగా భావిస్తూ వచ్చిన మాజీ జర్నలిస్ట్ ఎస్‌ఆర్ రమాకాంతరెడ్డి (50) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు.
ఆరుగురి జీవితాలకు...
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమాకాంతరెడ్డికి భార్య సరస్వతి, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె భావన, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు విఖ్యాత్ ఉన్నారు. గతంలో టీవీ 9, సాక్షి టీవీల్లో కెమెరామెన్‌గా పని చేశారు. వివాదాలకు దూరంగా ఉంటూ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సచివాలయ సిరికల్చర్ టెక్నీషియన్ అసిస్టెంట్‌గా ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఈ నెల 20న అనంతపురంలోని టీవీ టవర్ సమీపంలో బైక్‌పై వెళ్తున్న రమాకాంత్‌రెడ్డిని యూ–టర్న్ వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు నిర్ధారించారు. అంతటి విషాదంలోనూ కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవదానానికి ముందుకు వచ్చారు. కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమన్వయంతో ఆయన కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయాన్ని దానం చేశారు. దీంతో ఆరుగురికి కొత్త జీవితం లభించింది. పిల్లల చదువులకు పూర్తి సహకారంతో పాటు కారుణ్య నియామకం కింద ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జర్నలిస్టులు, సహచర ఉద్యోగులు కోరుతున్నారు. సోమవారం పెనుకొండలోని హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


