కేజీబీవీలో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో సమస్యల పరిష్కారం

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

అగళి: మండల పరిధిలోని కేజీబీవీలో ఎట్టకేలకు అపరిశుభ్రత తొలగిపోయింది. ‘ కేజీబీవీలో సమస్యల తిష్ట’ అన్న శీర్షికన గురువారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా అధికారులు స్పందించారు. అపరిశుభ్రంగా మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. డోర్లు లేని స్నానపు గదులకు డొర్లు ఏర్పాటు చేయించారు. తాగు నీటి సమస్యను పరిష్కరించారు. ఎన్నో రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నామని, కథనం రావడంతోనే తమ సమస్యలు పరిష్కారయ్యాయంటూ ‘సాక్షి’కి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా బాలిక సంరక్షణ సహాయ అధికారిణి అనిత గురువారం కేజీబీవీని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. విద్యార్థినులకు సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్‌ నాగరత్నమ్మ , ఉపాధ్యాయులకు సూచించారు. ఆమె వెంట ఎంఈఓ–1 నాగేంద్ర, ఎంఈఓ–2 చంద్రశేఖర్‌నాయుడు ఉన్నారు.

యువకుడి ఆత్మహత్య

పెనుకొండ: నగర పంచాయతీ పరిధిలోని వెంకటరెడ్డిపల్లిలో ప్రేమ్‌కుమార్‌ (25)) బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలమేరకు.. చెన్నేకొత్తపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్‌ 3 నెలల క్రితం వెంకటరెడ్డిపల్లికి చెందిన లిఖితను వివాహం చేసుకుని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అనుమానంతో భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు తలెత్తడంతో మనస్తాపం చెందిన ప్రేమ్‌కుమార్‌ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విషయమై మృతుడి బంధువులు, అమ్మాయి కుటుంబీకుల మధ్య గురువారం ఉదయం స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. అయితే సకాలంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహం అప్పగించలేదని మృతుని బంధువులు వాపోయారు.

బీఎల్‌ఓ సస్పెన్షన్‌

అగళి: మండల పరిధిలోని ఇరిగేపల్లిలోని బూత్‌ నంబర్‌ 156 బీఎల్‌ఓగా విధుల నిర్వహిస్తున్న విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ మొహమ్మద్‌ నయాజ్‌పై సస్పెండ్‌ వేటు పడింది. సర్‌ ప్రక్రియలో అలసత్వం, నిర్లక్ష్యం వహించినందుకు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ ... మొహమ్మద్‌ నయాజ్‌ను సస్పెండ్‌ చేసినట్లు తహసీల్దార్‌ హరికుమార్‌ పేర్కొన్నారు.

బీఎల్‌ఏ నాగేష్‌ హత్య కేసులో 9 మంది అరెస్టు

కనగానపల్లి: రెండు రోజుల క్రితం జరిగిన వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏ అంకె నాగేష్‌ హత్య కేసులో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. రామగిరి సీఐ ఎస్‌ మహమ్మద్‌ అలీ తెలిపిన వివరాల మేరకు... కనగానపల్లిలో ఈ నెల 21వ తేదీన హత్యకు గురైన అంకె నాగేష్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కనగానపల్లి సమీంలోని మారెమ్మగుడి వద్ద 9 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో వడ్ల దస్తగిరి బాబు, నితీష్‌కుమార్‌, వన్నూరప్ప, అంకె మురళీ, సురేష్‌, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, లక్ష్మిదేవి ఉన్నారు. అనంతరం వారిని ధర్మవరం కోర్టుకు తరలించారు.

రోడ్డుపై బైక్‌ స్టంట్లు

యువకులకు పోలీసుల కౌన్సెలింగ్‌

పుట్టపర్తి టౌన్‌: పట్టణ సమీపంలో ప్రమాదకర బైక్‌ స్టంట్లు చేస్తున్న షేక్‌ ఉమర్‌ఫరూక్‌, షేక్‌ సమీర్‌, వక్కల జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు అర్బన్‌ సీఐ యువరాజ్‌ తెలిపారు. గురువారం పోలీసుస్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సోషల్‌ మీడియాలో గుర్తింపు కోసం రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. ఇలాంటి చర్యలతో సామాన్యుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. అదుపులోకి తీసుకున్న యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే బైక్‌ స్టంట్స్‌, వీలింగ్‌, రేసింగ్‌ వంటి చేస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement