పుట్టపర్తి అర్బన్: డిమాండ్ల పరిష్కారం కోసం ఎంపీఈఓల చేస్తున్న సమ్మె గురువారం కూడా కొనసాగింది. పట్టణంలోని సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వద్ద రిలే నిరాహార దీక్షల్లో ఎంపీఈఓలు నిరసన తెలిపారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ వ్యవసాయశాఖలో ఇంకెంత కాలం ఒప్పంద ఉద్యోగులుగా పని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల నుంచి కేవలం రూ.12 వేల జీతాలకు అధికారులతో పాటు పని చేశామని ఇక చేసేది లేదని స్పష్టం చేశారు. డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె విరమించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే పల్లె సింధూరను కలిసి తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. కార్యక్రమంలో గౌరవాధ్యక్షుడు జాఫర్ వళీ, రాజేష్‌బాబు, సోమశేఖర్, గంగరాజు, అనిత, భవ్య, మీనా, ముబీనా, తదితరులు పాల్గొన్నారు.
పట్టపగలే భారీ చోరీ
● ‘నీట్’ ఫీజు చెల్లించేందుకు ఉంచిన డబ్బు, బంగారం అపహరణ
● లబోదిబోమంటున్న విద్యార్థి తల్లిదండ్రులు
పుట్టపర్తి అర్బన్: విద్యార్థి చదువు కోసం ఉంచుకున్న డబ్బుతో పాటు బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన పుట్టపర్తి మండలం పెడపల్లి పెద్ద తండాలో చోటు చేసుకుంది. లక్ష్మీరాంనాయక్ ,లక్ష్మీబాయి దంపతులు పెడపల్లి పెద్ద తండాలోని పెనుకొండ రోడ్డు వద్ద నివాసం ఉంటున్నారు. లక్ష్మీబాయి తన తల్లి సంవత్సరీకం ఉండగా ధర్మవరం మండలం నేలకోటకు రెండు రోజుల క్రితం వెళ్లింది. లక్ష్మీరాంనాయక్ పశువుల మేత కోసం గురువారం మధ్యాహ్నం తండా సమీపంలోని తోట వద్దకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు నేరుగా ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలోని బంగారు నగలు, డబ్బు ఎత్తుకెళ్లారు. కుమారుడు పునీత్‌కుమార్ నాయక్‌కు ఇటీవల విడుదల చేసిన నీట్‌లో ర్యాంక్ వచ్చింది. కౌన్సిలింగ్ కోసం ఇటీవల డ్వాక్రా సంఘంలో వచ్చిన రుణాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. రూ.1.5 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఉన్న సొత్తు దొంగలు ఎత్తుకెళ్లడంతో తన కుమారుడి చదువు ఏమవుతుందోనని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. సీఐ సురేష్ , పుట్టపర్తి రూరల్ ఎస్‌ఐ క్రాంతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ద్విచక్ర వాహనాల ఢీ
● మహిళ మృతి
తలుపుల: మండలంలోని పూలవాండ్లపల్లి సమీపంలో ఎర్రిపల్లి క్రాస్ వద్ద గురువారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిలో బి.రవణమ్మ (48) మృతి చెందింది. వివరాలు.. పెద్దన్నవారిపల్లికి చెందిన రామ్మోహన్ తన భార్య రవణమ్మ, మనవడు మానిత్‌తో కలసి ద్విచక్ర వాహనంలో తలుపుల నుంచి స్వగ్రామం బయలుదేరారు. ఎర్రిపల్లి క్రాస్ వద్ద అటు నుంచి వచ్చిన బైక్ వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఘటనలో రామ్మోహన్, మాన్విత్ గాయాలతో బయట పడ్డారు. అయితే రవణమ్మకు తీవ్ర గాయాలు కాగా అనంతపురం తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ట్రాక్టర్ ట్రాలీ కింద పడి వృద్ధురాలి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని ఆలూరుకు చెందిన లక్ష్మీదేవి (60)పై ట్రాక్టర్ ట్రాలీ టైరు వెళ్లడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ట్రాక్టర్ ట్రాలీ కింద ఉన్న నీడలో లక్ష్మీదేవి పడుకొని ఉండగా అదే గ్రామానికి చెందిన రామనాథ్‌రెడ్డి ట్రాక్టర్‌ను నడపగా ఆమైపె టైరు ఎక్కింది. ఆమె కేకలు విన్న రామనాథ్ ట్రాక్టర్ నిలిపి వెనక్కి వచ్చి చూడగా తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవి కనపడింది. చికిత్స నిమిత్తం హుటాహుటిన అనంతపురం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.


