పుట్టపర్తి అర్బన్: అసలే మారుమూల ప్రాంతం , గ్రామంలో అంతా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే. ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసే నిర్వాహకులు ఉన్నఫలంగా పాఠశాలకు రాకుండా మానేశారు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాలు... పుట్టపర్తి మండలం గంగిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో 53 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనం చేసేందుకు ఎస్‌ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో రత్నమ్మ అనే మహిళకు బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆమెను వంట చేస్తోంది. అయితే ఇటీవల వేసవి సెలవులు ముగిసినప్పటి నుంచి ఆమె సరిగా వండకపోవడం, తరచూ పురుగులు, బొద్దింకలు భోజనంలో వస్తుండటంతో విద్యార్థులు పలుమార్లు హెచ్‌ఎం రమేష్‌కు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితం భోజనంలో బొద్దింక రావడం చూసిన హెచ్‌ఎం ఆమెను గట్టిగా మందలించాడు. దీంతో మూడు రోజుల నుంచి ఆమె వంట చేయడానికి రాలేదు. విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో కావడంతో మొదటి రోజు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బుధ, గురువారాలు హెచ్‌ఎం రమేష్ కూరగాయలు తీసుకొచ్చి తోటి ఉపాధ్యాయులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయించి విద్యార్థులకు వడ్డించారు. ఈ విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో గురువారం వారంతా పాఠశాలకు వచ్చి ఆందోళన చేపట్టారు. రెండేళ్ల క్రితం వైఎస్ జగన్ హయాంలో పాఠశాలలో 110 మంది ఉన్న విద్యార్థులు 53కు వచ్చారని, ఇలాగే భోజనాలు పెట్టకపోతే అందరినీ వేరే పాఠశాలలకు పంపిస్తామని చెప్పారు. విషయాన్ని హెచ్‌ఎం... ఎంఈఓ ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులంతా ఆందోళనకు దిగడంతో మధ్యాహ్న ఏజెన్సీని రద్దు చేసి కొత్తగా ప్రతిపాదనలు తీసుకొని ఒకరిని ఎన్నుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రలకు నచ్చజెప్పారు. మరోసారి మధ్యాహ్న భోజనం సరిగా లేదని , అన్నం పెట్టలేదని ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని అందరినీ హెచ్చరించారు.
ఇబ్బందుల్లో గంగిరెడ్డిపల్లి పాఠశాల విద్యార్థులు
రెండు రోజులుగా ఉపాధ్యాయులే వంట చేస్తున్న వైనం


