అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా జి. కృష్ణమూర్తి బుధవారం బాధ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త డిప్యూటీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగా పనిచేద్దాం.. జిల్లా పరిషత్ ప్రగతికి పాటుపడుదామంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న మల్లికార్జున, ఏఓలు భాస్కర్ రెడ్డి, లెక్కల శ్రీనివాసులు, షేక్ నియాజ్ పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఉద్యోగాల పేరుతో మోసం
● పోలీసుల అదుపులో కేటుగాళ్లు
అనంతపురం సెంట్రల్: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ పుల్లయ్య బుధవారం మీడియాకు ఆ వివరాలు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం చెంచుగారిపల్లికి(ప్రస్తుతం దేవహనహళ్లి, బెంగళూరులో ఉంటున్నాడు) చెందిన కొర్రా విజయనాయక్, అనంతపురంలోని రహమత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీమ్ మిల్, తాడిపత్రికి చెందిన పల్లా నారాయణస్వామి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. డీఆర్‌డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇస్రో అనుబంధ సంస్థ అయిన ఎన్‌ఏఆర్‌ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అలాగే రిజర్వ్‌బ్యాంకులో తమకు రూ.కోట్ల డబ్బు ఉందని, విత్‌డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, తొలుత డబ్బులు ఇస్తే తిరిగి ఎక్కువ ఇస్తామని చెప్పి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. ఇలా నగరంలోని అరవింద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఎన్‌ఏఆర్‌ఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలు, రిజర్వ్ బ్యాంకులో డబ్బులు డ్రా చేయడ కోసమంటూ రూ. 6 లక్షలు చొప్పున మొత్తం రూ. 20 లక్షలు తీసుకొని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఆదర్శనగర్ సమీపంలో నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో కొర్రా విజయ్‌కుమార్, షేక్ ముజీమ్ మిల్‌ను అరెస్ట్ చేశారు. పల్లా నారాయణస్వామి అలియాస్ బన్ని పరారీలో ఉన్నట్లు సీఐ పుల్లయ్య పేర్కొన్నారు.
అప్పులబాధతో
యువకుడి ఆత్మహత్య
డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): అప్పుల భారం తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన డీ.హీరేహాళ్‌లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గురుప్రసాద్‌రెడ్డి వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్ (27) సాయి బాలాజీ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్ గేమింగ్, ట్రేడింగ్‌లకు అలవాటు పడిన గౌరీశంకర్ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి అందులో డబ్బు పెట్టాడు. తీవ్ర నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీరేమార్గం లేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి తన ఇంటి బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు. లక్ష్మీకి ఇద్దరు కుమారులు ఉండగా గౌరీశంకర్ చిన్న కుమారుడని, ఇంకా వివాహం కాలేదన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఆర్టీసీ డ్రైవర్ మృతి
రాయదుర్గంటౌన్: కర్ణాటకలోని గుడేకోట వద్ద బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి ఆర్టీసీ డ్రైవర్ ఎం.కరిబసప్ప (54) దుర్మరణం పాలయ్యారు. బంధువుల వివరాల మేరకు ... కరిబసప్ప దాదాపు 17 ఏళ్లుగా రాయదుర్గం ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తిరుపతి సర్వీస్ డ్యూటీ ముగించుకుని వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం సాయంత్రం కర్ణాటకలోని గుడేకోటలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. గుడేకోట సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్‌ను ఢీకొన్నాడు. ఘటనలో కరిబసప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మొలకాల్మూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


