పుట్టపర్తి అర్బన్: కనీస వేతనం కింద నెలకు రూ.35 వేలు జీతాలు పెంచాలి, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలి, తదితర డిమాండ్లతో జిల్లాలో ఎంపీఈఓలు చేపట్టిన సహాయ నిరాకరణ, నిరసన కార్యక్రమం రెండో రోజుకు చేరుకుంది. బుధవారం సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఎదురుగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. వారికి ఏపీ రైతు సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దిగి రావాలి చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య కార్యాలయంలోకి వెళ్లకుండా కొంత సేపు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం రూ.35 వేలు చెల్లించేలా జీఓ విడుదల చేయాలన్నారు. అలాగే నాన్ శాంక్షన్ పోస్టు నుంచి శాంక్షన్ పోస్ట్‌కు కన్వర్ట్ చేయాలని, హెల్త్ కార్డుల సదుపాయం కల్పించాలని , ప్రమాద బీమా, విధి నిర్వహణలో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి మాట్లాడుతూ వర్షా కాలంలో రైతులకు అండగా నిలవాలని, ఇన్సూరెన్స్ చేయించే కార్యక్రమంతో పాటు క్రాప్ బుకింగ్ చేయాలని వెంటనే సమ్మెను రద్దు చేసుకొని విధులకు హాజరు కావాలని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఉద్యోగులు ససేమిరా అంటూ తిరిగి శిబిరానికి చేరుకొని నిరసనను కొనసాగించారు. కార్యక్రమంలో ఎంపీఈఓ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ఉపాధ్యక్షుడు చెన్ననాయక్, జనరల్ సెక్రెటరీ నాగార్జున, గౌరవాధ్యక్షుడు జాఫర్, షామీర్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గంగరాజు, రాజేష్, రామమోహన్‌రెడ్డి, నాగరాజు, జిల్లాలోని ఎంపీఈఓలు పాల్గొన్నారు.


