గుడిబండ: తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ మండల పరిధిలోని మోపరుగుండు గ్రామంలోని దళిత కాలనీకి చెందిన మహిళలు, ప్రజలు బుధవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. మడకశిర నుంచి అమరాపురం రహదారిపై బిందెలను అడ్డుపెట్టి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళలు మాట్లాడుతూ కొన్ని రోజులుగా కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత శాఖాధికారులకు పలుమార్లు విన్నపించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బోరు బావులకు విద్యుత్ సమస్యతో తాగునీటికి తీవ్ర ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


