స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ సెంటర్ల తనిఖీ

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

ధర్మవరం అర్బన్‌: పట్టణంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లోని స్కానింగ్‌ సెంటర్లను సోమవారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ భాగ్యలక్ష్మి, డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ విజయ్‌కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతి ఒక్క స్కానింగ్‌కు రెఫరెల్‌ స్లిప్‌ ఉండాలని, లేకపోతే స్కానింగ్‌ చేయకూడదని స్కానింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు సూచించారు. పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌ పోస్టర్లు అందరికీ కనిపించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ధరల పట్టిక డిస్‌ప్లేలో ఉంచాలన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. తనిఖీల్లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

అర్జీలకు తక్షణమే

పరిష్కారం చూపాలి

పుట్టపర్తి టౌన్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని పోలీస్‌ అధికారులకు ఎస్పీ సతీష్‌కుమార్‌ సూచించారు. సోమవారం పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై 102 వినతులు అందాయి. ఎస్పీ సతీష్‌ కుమార్‌ స్వయంగా వికలాంగులు వద్దకు వెళ్లి వినతులు స్వీకరించి బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలు ఓపికగా విని సంబంధిత పోలీస్‌ అధికారులతో ఫోన్‌ చేసి మాట్లాడారు. అర్జీలు పునారావృతమైతే చర్యలు తప్పవని పోలీసు సిబ్బందిని హెచ్చరించారు.

కుక్కల దాడిలో వ్యాపారికి తీవ్ర గాయాలు

పావగడ: పట్టణంలోని ఆదర్శనగర్‌ వాసి, పండ్ల వ్యాపారి అయిన నరసింహరాజు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు.. నరసింహరాజు పండ్ల వ్యాపారాన్ని ముగించుకుని ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో బాపూజీ పాఠశాల మార్గంలో ఇంటికి బయలుదేరాడు. అయితే ఒక్కసారిగా సుమారు 15 వీధి కుక్కలు అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. కేకలు వేయడంతో చుట్టు పక్కన ఉన్న జనం కుక్కల్ని అదిలించి అతని ప్రాణాలు కాపాడారు. తీవ్రంగా గాయపడిన నరసింహరాజును చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు.

ఎంపీఈఓల పెన్‌డౌన్‌

ఉమ్మడి జిల్లాలో 334 మంది నిరసన

అనంతపురం అగ్రికల్చర్‌: సమస్యల పరిష్కరించాలంటూ ఎంపీఈఓలు పెన్‌డౌన్‌కు దిగారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 334 మంది సోమవారం నుంచి ఐదు రోజుల పాటు పెన్‌డౌన్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం ఎక్కడిక్కడ మండల, డివిజన్‌, జిల్లా గ్రీవెన్స్‌లో, వ్యవసాయశాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ పరిధిలో, ఆర్‌బీకేలకు అనుబంధంగా అనంతపురం జిల్లాలో 189 మంది, శ్రీసత్యసాయి జిల్లాలో 145 మంది... వెరసి 334 మంది ఎంపీఈఓలు సరైన వేతనం లేక, ఎలాంటి ఉద్యోగ భద్రత, ఇతరత్రా సదుపాయాలు లేక అతికష్టమ్మీద జీవితాలను నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఎలాంటిి ప్రోత్సాహం లేకపోవడంతో 334 మంది ఎంపీఈఓలు నిరసనకు దిగారు.

చైన్‌ స్నాచర్ల అరెస్ట్‌

బుక్కరాయసముద్రం: మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరించిన ఇద్దరు అంతరాష్ట్ర చైన్‌స్నాచర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ సుబ్బరాయుడు తెలిపిన వివరాలమేరకు.. గత నెల 23న బుక్కరాయసముద్రంలో ప్రభావతి అనే మహిళ గ్రామ శివారులో ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆమె అడ్డుకొని మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాయన్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అనంతపురము రూరల్‌ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పోలీసులు బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో బెంగళూరుకు చెందిన గణేష్‌, సూర్యలే దొంగతనం చేసినట్లు గుర్తించి శనివారం అరెస్ట్‌ చేశామన్నారు. వారి వద్ద నుంచి 35 గ్రాముల బంగారు గొలుసు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. అనంతరం జిల్లా కోర్టులో హాజరు పర్చగా జడ్జి నిందితులకు 14 రోజులు రిమాండ్‌ విధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement