గుడిబండ: కర్ణాటక రాష్ట్రం తుమకూరు పట్టణ రైల్వేస్టేషన్‌లో రైలు ఢీకొని విద్యార్థిని మృతి చెందింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. గుడిబండకు చెందిన నాగరాజు, రాధమ్మ దంపతుల కుమార్తె నవ్య (25) బెంగళూరులోని సప్తగిరి యూనివర్సిటీ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతోంది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నవ్య తుమకూరులో పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూనే విద్యను అభ్యసిస్తోంది. అయితే సోమవారం ఉదయం బెంగళూరులోని కళాశాలకు బయలుదేరి వెళ్లే సమయంలో తుమకూరు పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో ఉన్న రైల్వే పట్టాలను దాటుతుండగా అటు నుంచి వచ్చిన రైలు నవ్యను ఢీ కొట్టింది. మృతురాలిని హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. నవ్య మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
పాము కాటుకు
మహిళ బలి
లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షి బీసీ కాలనీకి చెందిన నాగమ్మ (40) పాముకాటుతో మృతి చెందింది. వివరాలు.. సోమవారం మధ్యాహ్నం మృతురాలు గడ్డి కోసం పొలంలోకి వెళ్లింది. గడ్డి కోసి కట్ట కట్టే సమయంలో మోపులో ఉన్న పాము నాగమ్మ ఎడమ చేతి వేళ్లకు కాటేసింది. దీంతో అక్కడున్న కొంతమంది గమనించి వైద్య పరీక్షలు నిమిత్తం ఆమెను లేపాక్షి పీహెస్‌సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నాగమ్మ మృతి చెందింది. మృతురాలికి భర్తతో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
హిందూపురం: మండలంలోని కగ్గల్లు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓడీ చెరువు మండలానికి చెందిన నాగార్జున (30) మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. నాగార్జున ద్విచక్ర వాహనంలో మడకశిర నుంచి కొడికొండ–సిరా హైవేపై లేపాక్షి వైపు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే చనిపోయాడు. పోలీసులు శవాన్ని పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హిందూపురం అప్‌గ్రేడ్ రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నిప్పంటుకొని వృద్ధుడి మృతి
కదిరి టౌన్: పట్టణానికి చెందిన వృద్ధుడు మంటలు అంటుకొని మృతి చెందాడు. పోలీసుల వివరాలమేరకు... నానాదర్గాకు చెందిన అబ్దుల్ ఘని (70) ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. కొద్ది రోజుల నుంచి కాళ్లు నడవడానికి వీలుకాని దుస్థితి నెలకొంది. అయితే ఘని ఇంట్లో బీడి తాగి పక్కకు వేయడంతో పక్కనే ఉన్న పేపర్లు అంటుకున్నాయి. మంటలు అబ్దుల్ ఘనికి వ్యాపించాయి. పెద్దగా కేకలు వేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అతను చనిపోయాడు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహన్ని కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. అబ్దుల్ ఘని భార్య, పిల్లలు దూరంగా ఉన్నారని పేర్కొన్నారు.


