● డాక్యుమెంట్ రైటర్ల ఆందోళన
పుట్టపర్తి: తమ ఉపాధిని దెబ్బతీసేందుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 396ను వెంటనే రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్ల డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తప్పుల్లేకుండా రాస్తూ ప్రభుత్వానికి, భూముల అమ్మకం, కొనుగోలుదారులకు వారధిగా ఉన్నామన్నారు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో ఉన్న తమకు తీవ్ర అన్యాయం చేసే విధంగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే జీఓ విడుదల చేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసే జీఓ 396ను రద్దుచేయాలన్న డిమాండ్‌తో ఈనెల 20 నుంచి 31వ తేదీ వరకూ నిరవధికంగా పెన్‌డౌన్ చేస్తున్నామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే జీఓను రద్దు చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో శాంతమూర్తి, బాబు, మహేష్, గురుమూర్తి, రామమూర్తి, హరి, రామకృష్ణ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
‘బైండోవర్’ ఉల్లంఘనపై జరిమానా
కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): ఘర్షణ కేసులో నిందితుడిగా ఉండి బైండోవర్ అయిన ఓ వ్యక్తి నిబంధనలు ఉల్లంఘించటంతో పోలీసులు జరిమానా విధించారు. చెన్నేకొత్తపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపల్లి గ్రామానికి చెందిన నరేంద్రరెడ్డి తన బంధువుల ఇంటిపై దాడి చేసి సామగ్రిని ధ్వంసం చేసిన సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పాల్పడకుండా అతన్ని స్థానిక తహసీల్దార్ వద్ద హాజరు పరచి తన సొంత పూచికత్తు కింద రూ.5 లక్షల విలువైన సెక్యూరిటీ బాండు రాయించుకున్నారు. కానీ అతను నిబంధనలు ఉల్లంఘించి తిరిగి సదరు వ్యక్తులపై బెదిరింపులు పాల్పడ్డాడని ఫిర్యాదు అందటంతో పోలీసులు సోమవారం అతన్ని తహసీల్దార్ వద్ద హాజరుపరచి రూ.25 వేల జరిమానా విధించారు.


