కదిరి అర్బన్: తన అక్క స్థలంలో వేసుకున్న రేకులషెడ్డును ధ్వంసం చేసి, తమను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచిన మొటుకుపల్లికి చెందిన ప్రభాకర్‌రెడ్డి, మల్లిరెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని బాధితురాలు శాంతమ్మ డిమాండ్ చేసింది. ఆదివారం కదిరి రూరల్ పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల మేరకు.. మొటుకుపల్లిలో గత శనివారం రాత్రి 11 గంటల సమయంలో శాంతమ్మ, తన కుమార్తెతో కలిసి అక్క లక్ష్మీబాయి స్థలంలో వేసిన రేకులషెడ్డులో నిద్రించారు. అదే గ్రామానికి చెందిన మల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి మద్యం సేవించి ఈ స్థలం తమదేనని, రేకులషెడ్డు పడగొట్టి కులం పేరుతో దూషించారని తెలిపింది. గతంలో మల్‌రెడ్డి తన అక్క లక్ష్మీబాయిని వ్యభిచార కూపంలో నెట్టాడని, తనను కూడా ముంబాయిలో సేట్ ఇంట్లో పనికి కుదుర్చినట్లు చెప్పి, రూ.50 వేలకు విక్రయించాడని ఆరోపించింది. 2000లో ప్రభుత్వం తన అక్క పేరిట రెండు సెంట్ల స్థలం మంజూరు చేసిందని, తన అక్కకు చదువు రాకపోవడంతో ఆమె భర్త పేరు మల్‌రెడ్డి అని పేరు రాయించుకున్నాడని తెలిపింది. తన అక్కకూ మల్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని, తన అక్క అనారోగ్యంగా ఉన్నప్పుడు బాగోగులు తానే చూసుకున్నానని, ఆమె మరణించిన తర్వాత మల్‌రెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడని ఆవేదన చెందింది.


