● ఐదుగురికి గాయాలు
ముద్దనూరు: ముద్దనూరు– తాడిపత్రి జాతీయ రహదారిలో చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక వెళ్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. రాయదుర్గం నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చెన్నారెడ్డిపల్లె వద్దకు వెళ్లగానే ముందువైపు గొర్రెలు అడ్డు రావడంతో బస్సును డ్రైవర్ స్లో చేశాడు. ఇంతలో వెనుక వస్తున్న లారీ.. బస్సును ఢీకొంది. దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతినింది. బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్ప గాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకొని వెళ్లిపోయారు. కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు. లారీ డ్రైవరుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ డ్రైవరు మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు సమాచారం.


