కదిరి అర్బన్: ప్రత్యామ్నాయ పంటలు సాగుతోనే రైతులకు మేలు అని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డా. వీ సుమతి, డీన్ ఆఫ్ స్టూడెంట్ ఆఫైర్స్ డాక్టర్ సంపత్‌కుమార్ తెలిపారు. శుక్రవారం సత్యసాయి జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిశీలించేందుకు వారు కదిరి వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చారు. ఇక్కడ శాస్త్రవేత్తలతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై చర్చించారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. బీవీ భాస్కర్‌రెడ్డితో కలిసి తలుపుల మండలం వేపమానిపేట, తొగటవాండ్లపల్లి, ఓడీసీ మండలం మిట్టపల్లి,పులగం పల్లి గ్రామాల్లో పంటల సాగును పరిశీలించారు. ప్రసుత్తం జూలై రెండో పక్షం నుంచి వేరుశనగ సాగు ఆశాజనకంగా ఉండదని, ప్రత్యామ్నాయ పంటలైన ఆముదం, కంది, పెసర, కొర్ర, సజ్జ పంటలను సాగు చేసుకోవాలని రైతులను సూచించారు.


