నీటి సమస్య తీర్చాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

నీటి సమస్య తీర్చాలని నిరసన

Jul 18 2026 9:45 AM | Updated on Jul 18 2026 9:45 AM

గుడిబండ: మండల పరిధిలోని బీటీపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య తీర్చాలని మహిళలు ఖాళీ బిందెలతో శుక్రవారం తాళికెర సచివాలయం ఎదుట బైఠాయించారు. తాళికెర పంచాయతీలోని బీటీపల్లి గ్రామంలో రోజూ తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సమస్య తీర్చాలని పలు సార్లు అధికారులకు విన్నవించినా ఏమాత్రం పట్టించుకోలేదని మహిళలు ఆవేదన చెందారు. దీంతో నీటి సమస్య పరిష్కరించాలని మహిళలు ఆందోళన చేశారు.

చెక్‌బౌన్స్‌ కేసులో

వ్యక్తికి ఆరునెలల జైలు

ధర్మవరం అర్బన్‌: చెక్‌బౌన్స్‌ కేసులో ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ధర్మవరం అడిషనల్‌ జ్యుడీయల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ వెంకట హరీష్‌ శుక్రవారం తీర్పు ఇచ్చారు. వివరాలు..చిలకం రమణారెడ్డి అనే వ్యక్తి ఆదినారాయణకు రూ.8.50 లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఆదినారాయణ ఇచ్చిన చెక్కును బ్యాంకులో వేశాడు. ఆదినారాయణ అకౌంట్‌లో డబ్బులు లేకపోవడంతో చెక్‌ బౌన్స్‌ అయ్యింది. దీంతో చిలకం రమణారెడ్డి నవంబర్‌ 2019లో ఎన్‌ఐ యాక్ట్‌ కింద కోర్టులో చెక్‌ బౌన్స్‌ కేసు వేశాడు. విచారించిన న్యాయమూర్తి ఆదినారాయణను దోషిగా తేల్చి ఆరునెలల జైలుతోపాటు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని జడ్జి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా మరో మూడు నెలలు సాధారణ జైలు అనుభవించాలని తీర్పు వెలువరించారు.

మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్‌కు జరిమానా

చిలమత్తూరు: మద్యం సేవించి వాహనం నడిపిన లారీ డ్రైవర్‌కు హిందూపురం ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు రూ.12,500 జరిమానా విధించినట్టు సీఐ జనార్దన్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. గురువారం మండలంలోని 44వ నెంబరు జాతీయ రహదారి కొడికొండ చెక్‌పోస్ట్‌లో వాహనాల తనిఖీలు చేస్తుండగా, ఢిల్లీకి చెందిన పవన్‌ సింగ్‌ మద్యంతాగి లారీ నడుపుతూ పట్టుబడ్డాడన్నారు. డ్రైవర్‌ను ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరు పరచగా రూ. 12,500 జరిమానా విధించినట్టు ఆయన తెలిపారు.

బురుజు చుట్టూ అపరిశుభ్రత తొలగింపు

మడకశిర: పట్టణంలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో ఉన్న బురుజు నిర్వహణపై ఎట్ట కేలకు పురావస్తుశాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఇటీవల ‘సాక్షి’లో ‘నిద్రావస్థలో పురువస్తుశాఖ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆశాఖ అధికారులు స్పందించారు. బురుజు చుట్టూ పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించడానికి శుక్రవారం చర్యలు తీసుకున్నారు. గడ్డి,పిచ్చి మొక్కలను తొలగించి బురుజు చుట్టూ శుభ్రం చేశారు. ఇంతకు మునుపు గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో బురుజు తన అందాన్ని కోల్పోయింది. దీంతో పర్యాటకులు కూడా బురుజు వద్దకు వెళ్లడానికి ఇష్టపడే వారు కాదు. దూరం నుంచే బురుజును తిలకించేవాళ్లు.

వ్యక్తిపై కత్తితో దాడి

కదిరి టౌన్‌: మున్సిపల్‌ పరిధిలోని రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఉన్న ఇంతియాజ్‌పై ముజాయిద్‌ అలియాస్‌ ముజ్జు అనే వ్యక్తి శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేశాడు. అవుట్‌ పోస్టు పోలీసులు తెలిపిన మేరకు.. ఇంతియాజ్‌ తన ఇంటి సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తుండగా వారించాడు. దీంతో మత్తులో ఉన్న ముజాయిద్‌ (ముజ్జు) ఇంతియాజ్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతియాజ్‌కు గొంతు వద్ద తెగింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని కదిరి ప్రభుత్వాస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. ముజాయిద్‌(ముజ్జు) గంజాయి కేసులో గతంలో పలుమార్లు జైలుకు వెళ్లినట్లు సమాచారం.అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement