పుట్టపర్తి: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఏ రూపంలోనైనా సరే ధనార్జనే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతుల కడుపు కొట్టి ఓడీ చెరువుకు చెందిన టీడీపీ నేత బాలకృష్ణారెడ్డి అక్రమంగా సబ్సిడీ విత్తనకాయలను తన గోడౌన్‌లో నిల్వ ఉంచుకున్నాడు. విషయం తెలుసుకున్న విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సంయుక్తంగా గురువారం ఎస్ కొట్టాలలోని బాలకృష్ణారెడ్డి గోడౌన్‌లో దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉన్న 68 బస్తాలు (ఒక్కోటి 30 కేజీలు) సీజ్ చేశారు. ప్రభుత్వం రాయితీతో ఇచ్చే వేరుశనగ కాయలను స్వాహా చేసి అధిక ధరకు అమ్ముకునేందుకు గోడౌన్‌లో ఉంచుకోవటంపై అన్నదాతలు మండిపడుతున్నారు. సీఐ జమాల్ బాషా, ఏఓ వాసుప్రకాశ్ తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 68 బస్తాల సబ్సిడీ విత్తన వేరుశనగ సీజ్


