తాత అంత్యక్రియలను అడ్డుకున్న మనవడు | - | Sakshi
Sakshi News home page

తాత అంత్యక్రియలను అడ్డుకున్న మనవడు

Jun 17 2026 5:27 AM | Updated on Jun 17 2026 5:27 AM

భూమి తన పేరుతో రాయాలని డిమాండ్‌

కదిరి అర్బన్‌: సమాజంలో రోజురోజుకూ నైతిక విలువలు దిగజారి పోతున్నాయి. ఆస్తి కోసం ఎంతకై నా తెగిస్తున్నారు కొందరు దుర్మార్గులు. తన, పర అన్న తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. కదిరి పరిధిలో జరిగిన ఓ ఘటన ఈ కోవలోకి వస్తుంది. వివరాలు... కదిరి మండల పరిధిలోని యాకాల చెరువుపల్లికి చెందిన రామచంద్ర (75) ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. మృతునికి ముగ్గురు కుమార్తెలు సరస్వతి, అరుణమ్మ, రమణమ్మతో పాటు కుమారుడు శేఖర్‌ ఉన్నారు. ఐదేళ్ల క్రితమే శేఖర్‌ చనిపోయాడు. అయితే రామచంద్ర ... తన రెండో కుమార్తె అరుణమ్మకు తనకున్న 70 సెంట్ల పొలాన్ని రిజిస్టర్‌ చేశాడు. ఈ నేపథ్యంలో రామచంద్ర చనిపోయాడు. తన తాత భూమిని తన పేరుతో రాయాలంటూ శేఖర్‌ కుమారుడు చెన్నకేశవ... రామచంద్ర అంత్యక్రియలు జరగకుండా అడ్డుకున్నాడు. దీంతో గ్రామ పెద్ద మనుషులు పంచాయితీ చేశారు. భూమి రాయిస్తామని చెన్నకేశవకు నచ్చజెప్పి అంత్యక్రియలను జరిపించారు.

పెన్షన్‌ కోసం

14 ఏళ్లుగా ఎదురుచూపు

పట్టించుకోని ఆర్టీసీ అధికారులు

కదిరి అర్బన్‌: తన భర్త చనిపోయి 14 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు తనకు వితంతువు పెన్షన్‌ మంజూరు చేయలేదని షాకిరున్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి వివరాలమేరకు... కదిరి ఆర్టీసీ డిపోలో జాకీర్‌ హుస్సేన్‌ డ్రైవర్‌గా పనిచేసేవారు. అయితే 2012లో కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి చెరువులో పడి మృతిచెందారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా పెన్షన్‌ కోసం జాకీర్‌ హుస్సేన్‌ భార్య షాకిరున్‌ ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా నేటికీ మంజూరు కాలేదు. భర్తను కోల్పోవడంతో పాటు నలుగురు పిల్లలను పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని బాధితురాలు షాకిరున్‌ వాపోతున్నారు. బీడీలు చుట్టేందుకు వెళ్తున్నాని, వచ్చే అరకొర సంపదన తినడానికి కూడా సరిపోవడంతో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఎంప్లాయిస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ అధికారులు , ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రజాప్రతినిధులను కలిసి సమస్యను విన్నవించినా ఫలితం లేదన్నారు. కనీసం ఇప్పటికై నా అధికారులు స్పందించి పెన్షన్‌, తన పిల్లలకు ఆర్ఫాన్‌ పెన్షన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని విన్నవించారు.

వ్యక్తిపై పోక్సో కేసు

గుత్తి రూరల్‌: ఓ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై మంగళవారం గుత్తి పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ రామారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ బాలికతో కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు వ్యక్తిని గతంలోనే తీవ్రస్థాయిలో మందలించారు. అయితే వారం రోజుల నుంచి తిరిగి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. విసిగిపోయిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అనంతరం శ్రీనివాసులుపై పోక్సోతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ రామారావు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement