ఎన్‌పీకుంట: మండలంలో కలప అక్రమ రవాణాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. కళ్లముందే కలప, సండ్ర కట్టెల లోడుతో ట్రాక్టర్లు, లారీలు దూసుకుపోతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. వాస్తవానికి నిబంధనల మేరకు చెట్లు కొట్టాలంటే రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి పొందాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. అటవీ సంపదను కొల్లగొట్టి దర్జాగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిధిలోని సోమరాజుకుంట, తాటిమానుగుంత, పడమరనడిమిపల్లి, గౌకనపల్లి, మరికొమ్మదిన్ని పరిధిలో అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో సండ్ర చెట్లు పెరిగాయి. ఈ చెట్లను నరికి డంప్ చేసుకొని ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ.లక్షలు గడుస్తున్నారు. యథేచ్ఛగా సండ్ర చెట్లను నరికి తరలిస్తున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడు సండ్ర కట్టెల లోడును మండల సరిహద్దును దాటించేందుకు టన్నుల ప్రకారం రేటు కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై తహసీల్దార్ లక్ష్మమ్మ, డీటీ దేవేంద్రనాయక్ వివరణ కోరగా అటవీ, రెవెన్యూ భూములలో ఉన్న సండ్ర చెట్లను నరికివేయడం చట్ట ఉల్లంఘనగా పరిగణిస్తామన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు.


