బడి బస్సు.. భద్రత తుస్సు! | - | Sakshi
Sakshi News home page

బడి బస్సు.. భద్రత తుస్సు!

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

కదిరి: జిల్లా రవాణా శాఖ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి బడి బస్సులను కొన్ని రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి బస్సులోనూ ఏదో ఒక లోపం బయటపడుతుండడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలకు రవాణా శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. పాఠశాలలు పునః ప్రారంభం కానున్న జూన్‌ 12 నాటికి పూర్తి స్థాయి సామర్థ్యం, నిబంధనలకు అనుగుణంగా బస్సులు ఉండాలని హెచ్చరిస్తున్నారు.

బయటపడిన లోపాలెన్నో..

జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి మొత్తం 596 బస్సులు ఉన్నాయి. ఇప్పటి వరకూ రవాణా శాఖ అధికారులు 342 బస్సులను తనిఖీ చేశారు. మరో 254 బస్సులను తనిఖీ చేయాల్సి ఉంది. తనిఖీ చేసిన వాటిలో ఇప్పటి వరకూ 183 బస్సుల్లో వివిధ రకాల లోపాలు బయటపడడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. 56 శాతం బస్సుల్లో ప్రధమ చికిత్స పెట్టెలు లేవని గుర్తించారు. 92 శాతం బస్సుల్లో ప్రథమ చికిత్సకు సంబంధించిన మందులు, పరికరాలు లేవని తేలింది. 36 శాతం బస్సుల్లో హ్యాండ్‌ బ్రేక్‌ లేదని, చాలా బస్సుల్లో అత్యవపర ద్వారం వద్ద కూడా సీట్లు అమర్చినట్లు రవాణాశాఖ అధికారులు గుర్తించారు. 96 శాతం బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు కానరాలేదు. కేవలం 12 బస్సుల్లో మాత్రమే వాహన లొకేషన్‌ ట్రాకింగ్‌ పరికరాలు ఉన్నాయి. ఎక్కువ శాతం బస్సుల్లో నాసిరకం వైరింగ్‌ ఉన్నందున అగ్ని ప్రమాదాలు, షార్ట్‌ సర్క్యూట్‌ చోటు చేసుకునే ప్రమాదమున్నట్లుగా అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా 36 బస్సులకు డ్రైవర్లుగా 60 ఏళ్లు పైబడిన వారిని నియమించుకున్నట్లుగా నిర్ధారణ అయింది.

మరి కొన్ని వారాల్లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సుల భద్రతపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల్లో బడి బస్సుల నిర్వహణలో డొల్లతనం వెలుగు చూస్తుండడంతో రవాణా శాఖ అధికారులు అవాక్కవుతున్నారు.

ఫిట్‌నెస్‌ పరీక్షలు

చేయించడంలో నిర్లక్ష్యం

తనిఖీల్లో వెలుగు చూస్తున్న డొల్లతనం

ఖాళీగా ప్రథమ చికిత్స బాక్స్‌లు

చాలా బస్సుల్లో తెరుచుకోని

అత్యవసర ద్వారాలు

నిశితంగా పరిశీలిస్తున్న

రవాణాశాఖ అధికారులు

తనిఖీలకు సహకరిస్తాం

మా స్కూల్‌కు 3 బస్సులు ఉన్నాయి. వేసవి సెలవుల్లో అన్ని బస్సులూ కండీషన్‌లో ఉండేలా చిన్నపాటి మరమ్మతులు చేయిస్తున్నాం. ఫిట్‌నెస్‌ విషయంలో రాజీ పడం. ఎందుకంటే పిల్లల్ని క్షేమంగా ఇంటికి చేర్చే వరకూ మాదే పూర్తి బాధ్యత. అందుకే బస్సుల తనిఖీ విషయంలో రవాణాశాఖ అధికారులకు సహకరిస్తాం.

– పి.సురేష్‌కుమార్‌, షిర్డీ సాయి స్కూల్‌, కదిరి

ఫిట్‌నెస్‌ లేకుంటే చర్యలు తప్పవు

వేసవి సెలవులు కావడంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా వ్యాప్తంగా స్కూల్‌ బస్సులను తనిఖీలు చేసి అందులో లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నాం. ఫిట్‌నెస్‌ టెస్ట్‌ బాధ్యతలను ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అది బుక్కపట్నం వద్ద ఉంది. ఫిట్‌నెస్‌ పత్రాలు లేకుండా బస్సులు రోడ్డెక్కితే చర్యలు తీసుకుంటాం.

– కరుణసాగర్‌ రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement