సాక్షి, పుట్టపర్తి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ‘తెలుగు తమ్ముళ్లు’ పెత్తనం చెలాయిస్తున్నారు. తాము చెప్పినట్లు వినాలని అధికారులను బెదిరిస్తున్నారు. చెప్పిన మాట వినకుంటే వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వర్తిస్తే తమ ఉద్యోగానికి ఇబ్బంది వస్తుందని అధికారులు ససేమిరా అనడంతో బదిలీ వేటు వేస్తున్నారు.
జోరుగా లాబీయింగ్..
జిల్లా కేంద్రమైన పుట్టపర్తి మున్సిపాలిటీలో ‘తెలుగు తమ్ముళ్లు’ చెప్పిందే వేదంగా నడుస్తోంది. మాట వినని అధికారులను బదిలీపై పంపించేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటికే ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ఇటీవల కొత్తగా మరో కమిషనర్ బాధ్యతలు చేపట్టారు. అయితే నిబంధనల ప్రకారమే తాను విధులు నిర్వర్తిస్తానని చెబుతున్నారు. కానీ ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న 25 మంది ఉద్యోగుల అంశం తెరపైకి రావడంతో కమిషనర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ మొదలైంది. ఏడాదిన్నర కాలంగా పలుమార్లు విన్నవించినా ఫలితం రాలేదు. అయితే ఉన్నఫలంగా నియామకాలకు ప్రక్రియ షురూ కావడంతో కార్యకర్తలు ఎవరికి వారుగా షాడో ఎమ్మెల్యే వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది.
కుటుంబ సభ్యులను చేర్చుకోవాలంటూ..
మున్సిపల్ కార్యాలయంలోని శానిటేషన్ విభాగంలో కాంట్రాక్టు కింద సిబ్బందిని తీసుకుంటారు. అయితే ‘తెలుగు తమ్ముళ్ల’ కుటుంబాలకు చెందిన 25 మందిని చేర్చుకోవాలని నాయకులు పట్టుబట్టారు. పుట్టపర్తి షాడో ఎమ్మెల్యేగా పేరుపొందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా పలుమార్లు అధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. అయితే తాజాగా 25 మంది సిబ్బంది చేర్చుకోవచ్చని ఆదేశాలు జారీ కావడంతో ‘తెలుగు తమ్ముళ్ల’ మధ్య భారీ పోటీ నెలకొంది. ఏడాదిన్నర కాలంగా విఫలమైన పంతం నెగ్గడంతో శానిటేషన్ విభాగంలో చేరేందుకు భారీగా పోటీ పడుతున్నారు. అర్హత లేని వారిని సైతం చేర్చుకోవాలని సిఫారసు చేస్తుండటం గమనార్హం.
పనిచేయకుండా వేతనం పొందాలనే..
శానిటేషన్ విభాగంలో ప్రస్తుతం ఉన్న వారు కూడా అంతంత మాత్రంగానే విధులు నిర్వర్తిస్తున్నారు. కొందరు పని చేయకుండా వేతనాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో ఒకసారి ఉద్యోగంలో చేరి.. అధికార పార్టీ నాయకుల సిఫారసులతో కొనసాగాలని చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.18 వేల వరకు వేతనం తీసుకుంటారు. టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ.. విధులకు డుమ్మా కొట్టి వేతనాలు తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నట్లు సమాచారం. అర్హులను తీసుకుంటారా? లేక టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు పట్టం కడతారా అన్నది చూడాలి.
పుట్టపర్తి మున్సిపాల్టీలో
25 మంది ఉద్యోగాలకు సిఫారసు
మాట వినని కమిషనర్లపై బదిలీ వేటు
కొత్త కమిషనర్ రాకతో
పంతం నెగ్గించుకున్న టీడీపీ నేతలు
నేటి నుంచి శానిటేషన్‌లో
నియామకాల ప్రక్రియ షురూ
నిబంధనల ప్రకారమే
మున్సిపాలిటీలోని శానిటేషన్ విభాగంలోకి 25 మందిని నూతనంగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నాం. ఈనెల 29వ తేదీ నుంచి ఎంపిక ప్రక్రియ మొదలు పెడతాం. అర్హత ఆధారంగానే నియామకాలు చేపడతాం. ఎలాంటి అవకతవకలకు తావు లేదు. రాజకీయ సిఫారసులకు తలొగ్గే ప్రసక్తే లేదు.
– శ్రీనివాసులు, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్


