దంచేసిన వాన | - | Sakshi
Sakshi News home page

దంచేసిన వాన

May 28 2026 12:16 AM | Updated on May 28 2026 12:16 AM

పుట్టపర్తి అర్బన్‌: భనుడి భగభగలతో అల్లాడిపోయిన జిల్లా వాసులపై వరుణుడు కరుణ చూపాడు. నైరుతికి ముందే కరువు తీరా వర్షించాడు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలోని 31 మండలాల పరిధిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవగా వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ప్రవహించాయి. 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులకు అరటి, మామిడి, బీర, టమాటా తదితర పంటలు ఉద్యాన పంటలు తిన్నాయి. చాలాచోట్ల పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లు పాక్షకింగా దెబ్బతినడంతో ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

● పుట్టపర్తి మండలం రాయలవారిపల్లి నుంచి పుట్టపర్తికి రావాలంటే చిత్రావతి నది దాటాల్సి ఉంది. బ్రిడ్జి కింద వర్షపునీరు భారీగా చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. గాలివానకు ఎనుములపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని భారీ వృక్షం కూకటివేళ్లతో సహా ఆస్పత్రి భవనంపైకి పడింది.

● బత్తలపల్లి మండలం సంజీవపురం కాలనీలోకి వర్షపునీరు రావడంతో పలు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అక్కడే ఉన్న ఆలయంలోకి సైతం వర్షపునీరు చేరింది.

● తాడిమర్రి మండలం దాడితోటలో పాత రేకుల షెడ్డు కూలింది. గోడలు కూలడంతో 5 గొర్రెలు మృతి చెందాయి. మరో 5 గొర్రెలకు, ఓ ఎనుముకు కాళ్లు విరిగాయి. దీంతో రూ.1.3 లక్షలు నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరి కుళ్లాయప్ప తెలిపారు.

● ఇక కదిరిలో వడగళ్ల వాన దంచేసింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఆలయంపై పిడుగు పడినట్లు స్థానికులు చెబుతున్నారు.

● ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది.

హిందూపురంలో అత్యధిక వర్షపాతం

మంగళవారం సాయంత్రం వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. రాత్రి చినుకుచినుకుగా ప్రారంభమైన వాన..ఆ తర్వాత జోరందుకుంది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము వరకూ కురుస్తూనే ఉంది. ఒక్క అగళి మండలంలో తప్ప జిల్లాలోని 31 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా హిందూపురం మండలంలో 54.6 మి.మీ వర్షపాతం నమోదైంది. అలాగే నల్లచెరువు మండలంలో 54.2 మి.మీ, తలుపుల 47.4 మి.మీ, నల్లమాడ 47.2 మి.మీ, గాండ్లపెంట 46.4, కదిరి 45.2, గోరంట్ల 45.2, పుట్టపర్తి 42.6, కనగానపల్లి 42.4, బుక్కపట్నం 39.6, సీకేపల్లి 38.8, తనకల్లు 37.8, కొత్తచెరువు 32.8, రామగిరి 32.6, ధర్మవరం 32.4, లేపాక్షి 27.0, అమరాపురం 25.8, చిలమత్తూరు 25.8, అమడగూరు 25.2, పెనుకొండ 24.6, ఎన్‌పీ కుంట 22, సోమందేపల్లి 21, పరిగి 19.6, బత్తలపల్లి 18.4, ఓడీచెరువు 18.2, రొద్దం 11.2, తాడిమర్రి 10.2, ముదిగుబ్బ 9.6, మడకశిర 8.6, రొళ్ల 8.2, గుడిబండ మండలంలో 7.4 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని 31 మండలాల పరిధిలో మొత్తం 922 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

ఖరీఫ్‌ సాగుకు అనుకూలం..

తాజా వర్షాలు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తం కావడానికి ఉపయోగపడతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు లోతుగా దుక్కులు చేసుకోవడంతో గత ఖరీఫ్‌ పంట అవశేషాలు తొలగించుకుని సాగుకు సిద్ధం కావాలని సూచించారు. ఎల్‌–నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నట్లు తెలిపారు. జూన్‌ మొదటి వారాంతం లేదా రెండో వారం మొదట్లో జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.

జిల్లాలోని 31 మండలాల్లో

భారీ వర్షం

లోతట్టు ప్రాంతాలు జలమయం

కూలిన ఇళ్లు.. నేలవాలిన

కరెంటు స్తంభాలు

Advertisement
 
Advertisement
Advertisement