‘శ్రీ సత్యసాయి పేరుతో కొత్త జిల్లా ఏర్పడటం.. జిల్లా కేంద్రంగా పుట్టపర్తిని ప్రకటించడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. డిమాండ్‌కు అనుగుణంగా ప్రభుత్వ భూములపై కొందరు కన్నేశారు. శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ సమీపంలో బీడుపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో డ్వామా నర్సరీలో కొంత భాగాన్ని బ్రాహ్మణపల్లికి చెందిన ఈడిగ బాబుగౌడ ఆక్రమించారు. ఆ భూమి తనదేనంటూ మొక్కలు నాటి అధికారులను దబాయిస్తున్నాడు. దీనిపై డ్వామా అధికారులు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. వివాదం కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది.’
సాక్షి, పుట్టపర్తి: జిల్లా కేంద్రంలోని డ్వామా నర్సరీ వివాదంలో చిక్కుకుంది. మొత్తం 5.35 ఎకరాలుందని అధికారులు చెబుతున్నారు. అందులో 1.52 ఎకరాలు తనదేనంటూ బ్రాహ్మణపల్లికి చెందిన ఈడిగ బాబుగౌడ దబాయిస్తున్నారు. ఈ వివాదం కొన్నేళ్లుగా సాగుతోంది. భూమి విలువ పెరగడంతో బాబు గౌడ పూర్తి హక్కులు తెచ్చుకునే యత్నం చేస్తున్నారు. ఇప్పటికే 1.52 ఎకరాలకు కంచె వేసుకుని.. మామిడి, కొబ్బరి చెట్లు నాటించాడు. ఆ తర్వాత రెండేళ్ల క్రితం ఓసారి బోరు బావి తవ్వించాడు. అయితే అప్పట్లో నీరు పడలేదు. ఆ తర్వాత చెట్లు ఎండుతున్నాయని రెండు రోజుల క్రితం (ఆదివారం) మరోసారి బోరు బావి తవ్వించే యత్నం చేశారు. అధికారులు అప్రమత్తం కావడంతో బోరు తవ్వకం నిలిపివేశారు. అయితే మామిడి చెట్లు ఎండుతున్నాయని.. ఆ భూమి తనదేనని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నట్లు బాబుగౌడ చెబుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అడ్డు పడుతున్నా.. ఆ భూమి తనదేనంటూ దౌర్జన్యానికి దిగుతున్నాడు. 2022లో అప్పటి జిల్లా కలెక్టర్ పి.బసంత్‌కుమార్ ఆ భూమిని సందర్శించి.. డ్వామాకు చెందినదేనని స్పష్టం చేశారు. అయితే ఆ తర్వాత సెలవు దినాల్లో అధికారులు ఎవరూ ఉండరని భావించి.. కొబ్బరి మొక్కలు నాటడం.. కంపతో కంచె వేయించడంతోపాటు బోరుబావి తవ్వించాడు. అంతేకాకుండా ఎకై ్సజ్ అధికారుల ద్వారా అక్కడ ఉన్న ఓ ఈత చెట్టు ద్వారా కల్లు దుకాణానికి అనుమతులు తీసుకున్నట్లు తెలిసింది.
చెట్టు పేరుతో భూమి కబ్జా
పుట్టపర్తి మున్సిపాలిటీ బీడుపల్లి పరిధిలో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి సమీపంలో 16–1 సర్వే నంబరులో 5.35 ఎకరాలలో డ్వామా (జిల్లా నీటి యాజమాన్య సంస్థ)కు చెందిన నర్సరీ 1994 నుంచి కొనసాగు తోంది. అయితే బ్రాహ్మణపల్లికి చెందిన ఈడిగ రామచంద్రప్పకు 2006లో 16–5 సర్వే నంబరుతో నర్సరీలో 1.52 ఎకరాలను ట్రీ పట్టా కింద ఉమ్మడి అనంతపురం రెవెన్యూ అధికారులు అప్పట్లో కేటాయించారు. అయితే ఆ భూమిపై సర్వహక్కులు తనవేనంటూ ఈడిగ రామచంద్రప్ప తనయుడు బాబుగౌడ నాలుగేళ్లుగా దౌర్జన్యానికి దిగుతున్నాడు.
ట్రీ పట్టా అంటే..
జీవనోపాధి కోసం వినతిపత్రం అందజేస్తే ఈత చెట్లు, ఇతర ఫలాల చెట్లు ఉన్న ప్రాంతాన్ని ఏడాది గడువుతో ట్రీ పట్టా ఇస్తారు. ఆ కాల వ్యవధిలో కూడా సదరు వ్యక్తికి కేవలం ఆ చెట్ల నుంచి ఫలాలను తీసుకునే అధికారం మాత్రమే ఉంటుంది. భూమిపై ఎలాంటి హక్కూ ఉండదు. చెట్లు ఉన్నన్ని రోజులు.. ఏడాదికి ఓసారి రెన్యూవల్ చేసుకుంటూ చెట్ల నుంచి వచ్చే ఫలాలు తీసి విక్రయించి జీవనం సాగించుకోవచ్చు. ఏ సమయంలో అయినా.. సంబంధిత అధికారులు అనుమతులు రద్దు చేయవచ్చు. మరిన్ని అభివృద్ధి పనుల కోసం ఆ చెట్లను తొలగించి.. వేరే చెట్లను కూడా నాటుకునే అధికారం సంబంధిత అధికారులకు ఉంటుంది.
ట్రీ పట్టాతో మొక్కలు నాటిన బాబుగౌడ
అనుమతి లేకుండా బోరుబావి తవ్వే యత్నం
ఆ స్థలం డ్వామాదే అంటున్న అధికారులు
భూమి విలువ పెరగడంతో పట్టువిడవని బాబుగౌడ
ఫిర్యాదు చేశాం
సర్వే నంబరు 16/1 లో 5.35 ఎకరాల పరిధిలో డ్వామా నర్సరీ ఉంది. అందులో ఒకటిన్నర ఎకరా బాబుగౌడ ఆక్రమించాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశాం. అంతేకాకుండా ఇటీవల ఆ సర్వే నంబరు ఆధారంగా పరిశీలిస్తే.. ఆ భూమి నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలిసింది.
– విజయప్రసాద్, డ్వామా పీడీ


