అగళి: కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన మండల పరిధిలోని కసాపురం దగ్గర ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల వివరాలమేరకు.. హైదరాబాద్ నుంచి శిర వైపుగా వెళ్తోంది. అయితే మండలంలోని కసాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి దగ్గర కారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు అదుపు తప్పింది. దీంతో సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న ముగ్గురు మూగ గాయాలతో బయటపడ్డారు. ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ ఘటనతో విద్యుత్ స్తంభం ధ్వంసమైన ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి, మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
మహిళపై అత్యాచారయత్నం
గుత్తి: పట్టణ పరిధికి చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తి బలత్కారం చేయడానికి ప్రయత్నించాడు. పోలీసుల వివరాలమేరకు.. జడ్.వీరారెడ్డి కాలనీకి చెందిన లక్ష్మిదేవి పట్టణ శివారులోని డాబాలో పని ముగించుకుని శనివారం అర్ధరాత్రి ఒంట గంట సమయంలో ఇంటికి వెళ్తోంది. మార్గ మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమెను బలత్కారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆమె మెడలోని దారం చెవి కమ్మకు తగిలి చెవికు గాయమైంది. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆరు కుట్లు వేశారు. సీపీఎం మండల కార్యదర్శి నిర్మల బాధితురాలిని వెంట బెట్టుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ సురేష్ .. జడ్.వీరారెడ్డి కాలనీకి వెళ్లి బాధితురాలిని కలిసి జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. కాలనీ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు.
మతిస్థిమితం లేని
మహిళ మృతి
ఉరవకొండ: మండల పరిధిలోని చిన్నమూష్టూరు గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద మతిస్థిమితం లేని మహిళ (30 నుంచి 40 ఏళ్లు) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించిన అనంతరం సీఐ మహానంది మాట్లాడుతూ కొన్ని రోజులుగా మతిస్థిమితం లేని మహిళ హంద్రీనీవా కాలువ గట్ల వద్ద ఉంటూ తిరిగేదన్నారు. ఆహారం లేక ఎండ వేడిమికు తట్టుకోలేక కాలువ సమీపంలోని చెట్టు కింద మృతి చెందినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం యాచకురాలు మృతి చెంది ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
బకాయిలు విడుదల చేయాలి
అనంతపురం టవర్‌క్లాక్: ఏపీ ఎన్జీఓ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ హోంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యయ, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న జీపీఎస్ ఏపీ జీఎల్‌ఐ, గ్రాడ్యుటీ, సరెండర్ లీవ్‌లకు సంబంధించిన బకాయిలు కొద్దిగా మాత్రమే విడుదల చేశారని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికై న వెంకటేష్ బాబును ఘనంగా సన్మానించారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్న శ్రీధర్‌బాబును ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మాధవ్, రవికుమార్, జమీల బేగం, ప్రవీణ్ కుమార్, లక్ష్మీనారాయణ, దస్తగిరి, పద్మావతి, అనంతయ్య, మనోహర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ కార్యాలయంలో
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్సరెన్స్ హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. కచ్చితంగా ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.


