ధర్మవరం అర్బన్: మహిళా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం కరపత్రాలు విడుదల చేశారు. శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో దాదాపు 50 శాతం మహిళా ఉపాధ్యాయులే ఉన్నారన్నారు. మహిళా ఉపాధ్యాయులు పనిచేసే ప్రాంతంలో కనీస సౌకర్యాలు లేవని, లైంగిక వేధింపులు, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కుటుంబ బాధ్యతలు, విధి నిర్వహణ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సంక్షేమానికి రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులకు ప్రత్యేక స్టాఫ్‌రూమ్, ప్రత్యేక వాష్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, జిల్లాస్థాయిలో ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయులతో సంతకాలు సేకరించి యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణనాయక్, కార్యదర్శి అమర్‌నాథ్‌రెరడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ మేరి వరకుమారి, కార్యదర్శులు నాగేంద్రమ్మ, లతాదేవి తదితరులు పాల్గొన్నారు.


