ఇన్‌స్టాలో పరిచయం.. టీచర్‌కు వేధింపులు | - | Sakshi
Sakshi News home page

ఇన్‌స్టాలో పరిచయం.. టీచర్‌కు వేధింపులు

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

పుట్టపర్తి వాసిని అదుపులోకి తీసుకున్న బెంగళూరు పోలీసులు

దొడ్డబళ్లాపురం: టీచర్‌ మీ స్టూడెంట్‌నే అంటూ ఇన్‌స్టాలో మహిళా ఉపాధ్యాయురాలిని పరిచయం చేసుకొని ఆపై వేధించిన యువకుడిని పోలీసులు కటకటాలపాలుచేశారు. వివరాలు.. ఎలక్ట్రానిక్‌ సిటీలో టీచర్‌గా పని చేస్తున్న మహిళ (40)కు, పుట్టపర్తికి చెందిన అర్షద్‌ (37) ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు. మీ పూర్వ విద్యార్థినంటూ కొంతకాలం మంచివాడిగా చాటింగ్‌ చేశాడు. తరువాత ఫోన్లలో తరచూ మాట్లాడుకునేవారు. తిరుమలలో దర్శనం చేయిస్తానంటూ అర్షద్‌ డబ్బులు తీసుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా తనకు క్యాన్సర్‌ వచ్చిందని, చివరి కోరికగా నీతో కలవాలని ఆశగా ఉందన్నాడు. ఆమె తిరస్కరించగా, కనీసం న్యూడ్‌గా వీడియో కాల్‌ అయినా చేయాలని కోరాడు.

వీడియో సేవ్‌ చేసుకుని..

అతని మాటలు నమ్మిన మహిళ సరేనని కాల్‌ చేసింది. అయితే కాల్‌ను రికార్డు చేసుకున్న అతను.. నూ్‌య్‌డ్‌ వీడియో తన వద్ద ఉందని, డబ్బులు ఇవ్వాలని, తనతో కలవాలని, లేదంటే వీడియో వైరల్‌ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు తరచూ అతనికి డబ్బు పంపిస్తూ ఉంది. అయితే వేధింపులు తారాస్థాయికి చేరడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల సూచన మేరకు ఆమె అతన్ని బెంగళూరుకు రప్పించింది. వెంటనే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అవయవాలను కోసుకుంటానని అతను కొంతసేపు హల్‌చల్‌ చేశాడు.

గ్రామస్తుల దాడిలో

మతిస్థిమితం లేని వ్యక్తి మృతి

చిలమత్తూరు: మండల పరిధిలోని గాడ్రాళ్లపల్లికి చెందిన బావిరెడ్డి (51)అనే మతిస్థిమితం లేని వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేయడంతో మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు శనివారం రాత్రి వాహనాలపై రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశాడని, మనుషులపై కూడా దాడి చేయడం, బట్టలు లేకుండా తిరగడం వంటి చర్యలతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారన్నారు. ఆత్మ రక్షణలో భాగంగా గ్రామస్తులు బావిరెడ్డిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.

రైలు కింద పడి వ్యక్తి మృతి

కదిరి అర్బన్‌: మండల పరిధిలోని కాళసముద్రం సమీపంలో శనివారం అర్ధరాత్రి రైలు కింద పడి కదిరి మండలం చిప్పలమడుగు గ్రామానికి చెందిన రామాంజినేయులు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

రాప్తాడురూరల్‌: రాప్తాడు మండలంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపాయి. ఆయా ఘటనల్లో ఇద్దరు మృత్యువాతపడ్డారు. వివరాల్లోకి వెళ్తే... పుట్లూరు మండలం ఎల్లుట్లకు చెందిన రాజశేఖర్‌ (40) మామిళ్లపల్లి వైపు నుంచి జాతీయ రహదారిపై రాప్తాడు వైపు బైకులో వస్తున్నాడు. ఎం.చెర్లోపల్లి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

బైకు అదుపుతప్పి...

యల్లనూరు: యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన మారుతి తన సోదరి మమతతో పాటు ఆమె కుమారుడు గగన్‌ (5)తో కలిసి రాప్తాడు వైపు నుంచి అనంతపురం వైపు బైకులో వస్తున్నారు. అయితే గాయత్రి మిల్క్‌డైరీ సమీపంలో అదుపుతప్పి బైకు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గగన్‌ తలకు తీవ్ర గాయాలై మృత్యువాతపడ్డాడు. మారుతి, మమత గాయాలతో బయటపడ్డారు. తన కళ్లెదుటే కుమారుడు చనిపోవడంతో తల్లి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు ఘటనాస్థలాలను పరిశీలించారు.

రోడ్డు ప్రమాదంలో రైతు...

కుందుర్పి: మండలంలోని రుద్రంపల్లికి చెందిన మహలింగప్ప అనే రైతు తన వ్యవసాయ పొలంలో పండించిన చిలగడ దుంపలను హైదరాబాద్‌ మార్కెట్‌కు బొలెరోలో తీసుకెళ్తున్నాడు. అయితే శనివారం రాత్రి కర్నూలు సమీపంలో బొలెరో వాహనాన్ని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొంది. ఈ ఘటనలో మహలింగప్ప అక్కడికక్కడే చనిపోయాడని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement