తాడిపత్రి రూరల్: తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో అమృత్ పథకం కింద జరుగుతున్నా పనుల్లో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వేస్టేషన్‌లో వివిధ పనుల నిమిత్తం రెండు విడతలుగా రూ.20 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికీ ఆయా పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనికితోడు పనుల్లో కూడా నాణ్యతలో లోపాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్ మాస్టర్ కార్యాలయం ఎదురుగా జరుగుతున్న గ్రానైట్ బండ పరుపు కోసం ప్లాట్ ఫారంపై ఉన్న సిమెంట్ కాంక్రీట్‌ను తొలగించారు. సిమెంట్ బెడ్ పనులు చేస్తున్నారు. సిమెంట్ బెడ్ కోసం వేసిన సిమెంట్, ఇసుకను నిబంధనల మేరకు వేయకుండా పనులు చేశారన్న ఆరోపణలున్నాయి. బెడ్ కోసం ఉపయోగిస్తున్న కంకర కూడా నాణ్యత లోపించిందంటున్నారు. ఇందులో కంకర పొడి కనిపిస్తోందని, కొంత వరకు వేసిన సిమెంట్ బెడ్‌పై క్యూరింగ్ సరిగా చేయలేదన్న విమర్శలున్నాయి. ఆ బెడ్‌పై గ్రానైట్ బండ పరుపు పరచడం వల్ల భవిష్యత్తులో కుంగిపోయి ఎగుడు, దిగుడుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు..
రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న పనుల్లో అధికారుల పర్యవేక్షణా లోపం కనిపిస్తోంది. జరుగుతున్న పనులను అధికారుల పరిశీలించకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యం చేస్తున్నారు. జరిగిన పనుల నాణ్యతను లోతుగా పరిశీలిస్తే తప్ప ఏమేరకు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నారో అర్థమవుతుందని ప్రయాణికులు చెబుతున్నారు.


