ప్రశాంతి నిలయం: చియా సాగుతో అద్భుత ఫలితాలు సాధించిన అమడగూరు మండలం జౌకుల కొత్తపల్లికి చెందిన మహిళా రైతు గజ్జల శ్రీదేవిని కలెక్టర్ శ్యాం ప్రసాద్‌లో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ.. 1.30 ఎకరాల విస్తీర్ణంలో బైబ్యాక్ విధానం కింద చియా సాగు చేపట్టినట్లు వివరించారు. 11.03 క్వింటాళ్ల దిగుబడి సాధించడంతో క్వింటా రూ.14 వేలు చొప్పున రూ.1.54 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. పెట్టుబడుల పోను రూ.1.39 లక్షలు మిగిలినట్లు వివరించారు. కార్యక్రమంలో డీఏఓ కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేయండి
ప్రశాంతినిలయం: ఈ నెల 23 వరకూ జిల్లాలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన పోషణ పక్వాడ పక్షోత్సవాలను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. అంగన్‌వాడీలను బలోపేతం చేయడం, తల్లీబిడ్డల ఆరోగ్యం, మెదడు అభివృద్ధి, జంక్ ఫుడ్‌తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. 0–6 ఏళ్ల పిల్లలకు ఆటల ఆధారిత విద్య, సృజనాత్మకత, స్క్రీన్ టైం తగ్గించి బహిరంగ ఆటలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ ప్రమీల, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజబేగం, డీసీపీఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ సర్పంచ్ దుర్మరణం
పావగడ: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అమరాపురం మండలం విరుపసముద్రం గ్రామానికి చెందిన రవికుమార్ (38)కు భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. గతంలో ఆ గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం మడకశిరకు మకాం మార్చారు. ఈ నేపథ్యంలో పావగడ తాలూకా గౌడేటి గ్రామంలో మంగళవారం జరిగిన జాతరకు ద్విచక్ర వాహనంపై వచ్చిన రవికుమార్... రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. దొమ్మతమరి గ్రామ పరిధిలోని ఎల్లగానిగుట్ట ప్రాంతంలో ప్రయాణిస్తుండగా రోడ్డు తగ్గు ప్రదేశంలో ఎదురుగా వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీ కొంది. ఘటనలో రోడ్డుపై పడిన రవికుమార్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని గుండెలవిసేలా రోదించారు. వృద్ధాప్యంలో తమ బాగోగులు ఎవరు చూసుకుంటారంటూ తల్లి అంజినమ్మ రోదించిన తీరు చూపరులను కంటి తడి పెట్టించింది. విషయం తెలుసుకున్న జేడీఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తిమ్మరాయప్ప, ఆర్‌సీ అంజినప్ప, తిమ్మారెడ్డి, బలరామరెడ్డి, ఎన్‌ఏ ఈరణ్ణ తదితరులు ఆస్పత్రికి చేరుకుని రవికుమార్ భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రేమ విఫలం..
యువకుడి బలవన్మరణం
కనగానపల్లి: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కనగానపల్లి మండలం కొండ్రెడ్డిబావి గ్రామానికి చెందిన రైతు కె.రంగారెడ్డి, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వ్యవసాయంతో జీవనం సాగిస్తూ అతి కష్టంపై కుమారుడు మధుసూదన్‌రెడ్డి (25)ని ఏబీఏ వరకు చదివించారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తల్లికి మోకాళ్ల ఆపరేషన్ కోసమని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఆ సమయంలో తండ్రితో పాటు ఉద్యోగాన్వేషణలో ఉన్న మధుసూదన్‌రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉంటూ ఆమె బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఆ సమయంలో తల్లికి వైద్య సేవలు అందించేందుకు వచ్చే ట్రైనీ నర్సుతో (కర్నూలుకు చెందిన యువతి) మధుసూదన్‌రెడ్డి పరిచయమై ప్రేమగా మారింది. మూడు, నాలుగు నెలల పాటు ప్రేమ వ్యవహారం నడిచింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, ఆ యువతి తనను తప్పించుకుని తిరుగుతుండటంతో మధుసూదన్‌రెడ్డి మనోవేదనకు లోనయ్యాడు. మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలసి ఇంటి వద్దనే పడుకున్న మధుసూదన్‌రెడ్డి... అర్ధరాత్రి సమయంలో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నిద్రలేచిన తల్లిదండ్రులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకుని పరిశీలించి, అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న లేఖను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అందులో కర్నూలుకు చెందిన యువతి తనను ప్రేమించి మోసం చేసినట్లుగా రాసి ఉంది. ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ఎం.రిజ్వాన్ తెలిపారు.


