కదిరి అర్బన్: మండలంలోని పట్నం గ్రామంలో బుధవారం యూరియా కలిపిన నీరు తాగి 13 గొర్రెలు మృతిచెందాయి. స్థానికులు తెలిపిన మేరకు పట్నం గ్రామానికి చెందిన కృష్ణ తన గొర్రెలను మేపు కోసం అటవీ ప్రాంతానికి తీసుకెళుతూ.. మార్గ మధ్యంలో దాహమేసిన గొర్రెలు పరుగు తీస్తూ ఓ పొలం వద్ద యూరియా కలిపిన బకెట్‌లోని నీటిని తాగేశాయి. దీంతో 13 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని కాపరి వాపోయాడు. పట్నం పశు వైద్యాధికారి డాక్టర్ సునీత సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
వృద్ధుడి ఆత్మహత్య
అమరాపురం: అనారోగ్యం తాళలేక ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... అమరాపురంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న గొల్ల చిక్కాటప్ప (80) మంగళవారం రాత్రి తన కుమారుడు మల్లికార్జున ఇంట్లో భోజనం ముగించుకుని గేదెల కొట్టం వద్దకు నిద్రించేందుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున మాజీ సర్పంచ్ గోవిందప్ప పొలంలోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన స్థానికులు గుర్తించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కడుపునొప్పి, మూత్రాశయానికి సంబంధించిన సమస్యలతో బాధపడేవాడని, ఈ కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
హిందూపురం: మండలంలోని తూముకుంట పారిశ్రామికవాడలో బుధవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న సీఐ చంద్రాంజనేయులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహంపై పెట్రోల్ పోసి దహనం చేసినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు. మృతదేహం నుంచి ఆస్తికలు తీసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. మృతురాలు ఎవరనేది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఆలయంలో వెండి కిరీటం అపహరణ
శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలోని అంబేడ్కర్ నగర్‌లో వెలసిన రామస్వామి దేవాలయంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. స్వామి వారి వెండి కిరీటంతో పాటు 5 గ్రాముల బంగారాన్ని దుండగులు అపహరించారు. బుధవారం ఉదయం దేవాలయానికి వెళ్లిన పూజారి గుర్తించి సమాచారం ఇవ్వడంతో స్థానికులు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


