పుట్టపర్తి టౌన్: ‘తాను విశ్వ గురువు అని, తనకంతా తెలుసు’ అని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోదీ.. పశ్చిమాసియా యుద్ధ నివారణపై కృషి చేయకపోవడం బాధాకరమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు విచారం వ్యక్తం చేశారు. బుధవారం పుట్టపర్తిలోని సాయి ఆరామంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. మొదటి రోజు సమావేశాలకు బీవీ రాఘవులు హాజరై పలు విషయాలపై చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. శాంతికి, ప్రశాంతతకు, సామరస్యానికి నిలయమైన పుట్టపర్తిలో యుద్ధాల గురించి చర్చించాల్సి రావడం విచారకరమన్నారు. ఇరాక్‌ను సర్వనాశనం చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తుంటే.. శాశ్వత శాంతి ఒప్పందం కుదిరితేనే యుద్ధాన్ని విరమిస్తామని ఇరాక్ అంటోందన్నారు. శతాబ్దాలుగా మనకు ఇరాక్ చౌకగా ముడి చమురును సరఫరా చేస్తోందన్నారు. అలాంటి దేశం నాశనం అవుతుంటే యుద్ధ నివారణకు భారత్ ముందు వరసలో నిలవాల్సిన అవసరం ఉందన్నారు. బ్రిక్స్ దేశాల తరపున శాంతికి ప్రధాని మోదీ మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. అయితే రాజకీయ ప్రయోజనాలు, స్వార్థం కోసం దేశంలో ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మోదీ ప్రభుత్వం అడుగులేస్తోందన్నారు. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బలంగా ఉన్న బీజేపీ సీట్లు పెంపుతో మరింత బలపడేలా దృష్టి సారించిందన్నారు. అయితే రిజర్వేషన్లు, సీట్లు పెంచాలన్నా మొదటగా 2026 జనగణన పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఆ దిశగానే కేంద్రం ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల సంస్కరణలకు సీపీఎం పోరాటాలు సాగిస్తుందన్నారు. కేరళలో తిరిగి లెఫ్ట్‌ప్రంట్ అఽధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ రాజధాని ఏర్పాటు అంశంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు


