రాజకీయ పోస్టింగ్‌లకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

రాజకీయ పోస్టింగ్‌లకు చెక్‌

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ నిర్ణయంతో 30 మంది బదిలీ

అనంతపురం సెంట్రల్‌: రాజకీయ సిఫారసులకు చెక్‌ పెడుతూ శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ తనదైన మార్క్‌ను చూపించారు. వివిధ పోలీసు స్టేషన్లలో పనిచేస్తున్న 30 మందికిపైగా కానిస్టేబుళ్లకు స్థాన చలనం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... జిల్లాల విభజన సమయంలో శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన కానిస్టేబుళ్లలో 30 మందికి పైగా అక్కడ పనిచేయడానికి అయిష్టత వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకులతో సిఫారుసులతో అనంతపురం జిల్లాలోని వివిధ పీఎస్‌ల్లో తిష్ట వేశారు. వీరందరూ ఆయా పీఎస్‌ల్లో బాస్‌లకు అత్యంత కీలకమైన వారుగా చలామణి అవుతున్నారు. అనంతపురం వన్‌టౌన్‌ పీఎస్‌లోనే నలుగురు కానిస్టేబుళ్లు తిష్టవేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఓ కానిస్టేబుల్‌ ఇక్కడ పనిచేయడానికి ఇతర జిల్లాకు చెందిన ఓ మంత్రి ద్వారా నేరుగా డీజీపీ కార్యాలయం నుంచి సిఫారసు చేయించాడంటే వన్‌టౌన్‌ పీఎస్‌కు డిమాండ్‌ ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఎస్పీ సతీష్‌కుమార్‌ శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించిన కానిస్టేబుళ్లందరూ తక్షణమే అక్కడ రిపోర్టు చేసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ జిల్లాకు సదరు కానిస్టేబుళ్లు ఏకమై శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేతో సంప్రదించి ఎస్పీ సతీష్‌కుమార్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా ఎస్పీ సతీష్‌కుమార్‌ తలొగ్గకుండా ఆ కానిస్టేబుళ్లందరూ శ్రీసత్యసాయి జిల్లాలోనే విధులు నిర్వర్తించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం కానిస్టేబుళ్ల వంతు కాగా, తర్వాత మిగిలిన కేడర్‌లోనూ స్థాన చలనం తప్పదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎస్పీ సతీష్‌కుమార్‌ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం పోలీస్‌ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.

కొడుకుపై తండ్రి రోకలి బండతో దాడి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

కదిరి టౌన్‌: స్థానిక మున్సిపల్‌ పరిధిలోని సైదాపురం గ్రామానికి చెందిన నారాయణస్వామి తన కొడుకు గణేష్‌నాయుడిపై రోకలి బండతో దాడి చేశాడు. మద్యానికి బానిసైన గణేష్‌ నాయుడు (24)కు పెళ్లి కాలేదు. దీంతో తాగుడు మానేయాలని తరచూ తండ్రి చెబుతూ వచ్చేవాడు అయితే మద్యానికి అలవాటు పడిన గణేష్‌ నాయుడు తండ్రి మాటలు పెడచెవిన పెట్టి మత్తులో గొడవపడేవాడు. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కుమారుడిని చూసి తండ్రి తీవ్ర స్థాయిలో మందలించాడు. ఆ సమయంలో కుమారుడు దుర్భాషలాడుతూ తండ్రిపైనే తిరగబడ్డాడు. అనంతరం మిద్దె పైకెళ్లి నిద్రకు ఉపక్రమిస్తుండగా తండ్రి నారాయణస్వామి రోకలిబండతో దాడి చేశాడు. ఘటనతో తీవ్ర రక్తగాయాలైన గణేష్‌ నాయుడిని కుటుంబసభ్యలు స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గణేష్‌ నాయుడు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement