నేడు కూడేరు సంగమేశ్వరుడి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

నేడు కూడేరు సంగమేశ్వరుడి రథోత్సవం

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

కూడేరు: స్థానిక సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 6.45 గంటలకు మడుగు తేరు, సాయంత్రం 5.30 గంటలకు రథోత్సవం ఉంటుందని ఆలయ ఈఒ రమేష్‌ బాబు బుధవారం వెల్లడించారు. రథోత్సవానికి వేలాదిగా తరలి వచ్చే భక్తులు సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.

97 మంది విద్యార్థుల గైర్హాజరు

పుట్టపర్తి: పదో తరగతి పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఒకేషనల్‌ పరీక్షకు 97 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలోని 42 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 5,082 మంది విద్యార్థులకు గాను 4,987 మంది హాజరు కాగా, 95 మంది గైర్హాజరయ్యారు. అలాగే ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన ఇద్దరు విద్యార్థులు సైతం పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో మొత్తం 97 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ కిష్టప్ప వెల్లడించారు.

వ్యక్తి దుర్మరణం

బత్తలపల్లి: మండలంలోని 42వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరంలోని గాండ్లవీధికి చెందిన బలిజ చింతా చిన్న కొండప్ప(36) స్థానికంగా ఓ సిల్క్‌ హౌస్‌లో గుమాస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన కొండప్ప... అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమై బత్తలపల్లి మండలం సంజీవపురం సమీపంలోకి చేరుకోగానే నియంత్రణ కోల్పోవడంతో కాటికోటేశ్వరక్షేత్రానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఆర్చ్‌ను ఢీ కొని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కొండప్ప భార్య గీత, కుటుంబసభ్యులు బంధువులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. బత్తలపల్లి ఎస్‌ఐ సోమశేఖర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు.

వ్యక్తిపై కత్తితో దాడి

కదిరి అర్బన్‌: మండలంలోని కౌలేపల్లి వద్ద కుమ్మరవాండ్లపల్లికి చెందిన రమేష్‌పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలసి కౌలేపల్లి సమీపంలో ఫ్‌లైఓవర్‌ కిందకు వెళ్లిన సమయంలో అప్పటికే అక్కడ మద్యం సేవిస్తున్న కొందరు గమనించి అనుమానంతో గొడవ పడ్డారు. ఆ సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేయడంతో రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే కదిరిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement