తాడిపత్రి రూరల్: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెంచుకుని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో డివిజన్ల సంఖ్య 50 నుంచి 62కు పెరిగింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మున్సిపాలిటీలో 36 నుంచి 48, గుంతకల్లులో 37 నుంచి 48, రాయదుర్గంలో 32 నుంచి 40, గుత్తిలో 25 నుంచి 32, కళ్యాణదుర్గంలో 24 నుంచి 32, కదిరిలో 36 నుంచి 44, పుట్టపర్తిలో 27 నుంచి 28, మడకశిరలో 20 నుంచి 23, హిందూపురంలో 38 నుంచి 52, పెనుకొండ నగరపంచాయతీలో 20 నుంచి 23కు వార్డుల సంఖ్య పెరిగింది.
ఆటో బోల్తా – డ్రైవర్ మృతి
హిందూపురం: ఆటో బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బుధవారం తెల్లవారుజామున గోరంట్ల నుంచి హిందూపురం వైపుగా వస్తున్న ఆటో నందమూరి నగర్ వద్దకు చేరుకోగానే స్పీడ్ బ్రేకర్‌ను డ్రైవర్ గమనించకుండా వేగంగా పోవడంతో ఆటో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీ పక్క భాగానికి తగిలి బోల్తాపడింది. ఘటనలో పరిగి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ హిదాయతుల్లా (30) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న సైఫుల్లా, ఆసీఫ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై హిందూపురం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కమనీయం..
నారాయణుడి కల్యాణం
పెద్దపప్పూరు: మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి క్షేత్రంలో బుధవారం పౌర్ణమి సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుండా నారాయణ స్వామి, లక్ష్మికాంత దంపతులు సొంతఖర్చుతో స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి అనంతరం ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూలపల్లకిలో ఘనంగా ఊరేగించారు. భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదానకార్యక్రమం ఏర్పాటుచేశారు. ప్రతి పౌర్ణమికి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీ.


