లాలేపల్లిలో వైద్య శిబిరం | - | Sakshi
Sakshi News home page

లాలేపల్లిలో వైద్య శిబిరం

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

చిలమత్తూరు: మండలంలోని లాలేపల్లిలో విజృంభిస్తున్న విష జ్వరాలపై ‘లాలేపల్లిలో విషజ్వరాలు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో వెలువడిన కథనం కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాలతో బుధవారం ఆ గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. హిందూపురం మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి శివన్న, పర్యవేక్షకుడు గంగాధర్‌, వైద్యాధికారి డాక్టర్‌ లావణ్య నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికీ తిరిగి జ్వరపీడితులు, జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంపీడీఓ బాలాజీ హరికృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. డ్రెయినేజీలను శుభ్రం చేసి, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. దోమల నివారణకు మందును పిచికారీ చేయించారు.అనంతరం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురికి చికిత్సలు అందజేశారు. రక్త నమూనాలను పరిశీలించిన అనంతరం పలువురికి టైఫాయిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దగ్గు, జలుబు, నొప్పులతో బాధపడుతున్న 27 మందికి మందులను అందజేశారు. అనంతరం మలేరియా, టైఫాయిడ్‌, డెంగీ వ్యాప్తిపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాగా, గ్రామంలో నీరు కలుషితం కావడం వల్లనే విషజ్వరాలు ప్రబలాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటి ప్రాంతం నుంచి వస్తున్న తాగునీరు సురక్షితం కాదనే భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామంలో మరో మూడు రోజుల పాటు వైద్య శిబిరం కొనసాగుతుందని డాక్టర్‌ లావణ్య తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ జయచంద్రకుమార్‌, ఆరోగ్య కార్యకర్త మహేష్‌, ఎంఎల్‌హెచ్‌పీ నరేష్‌, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement