తలుపుల: తాగునీటి సమస్య పరిష్కారానికి ఇటీవల బోరు బావి ఏర్పాటు చేయించి కూడా ఎగువ ప్రాంతాలకు నీరు అందకుండా చేస్తారా? నీరు వదలమంటే దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకోండి అంటూ టీడీపీ నాయకుడు బెదిరిస్తాడా? అసలు మాకు తాగునీరెందుకు ఇవ్వరు? అంటూ సచివాలయ ఉద్యోగులను మహిళలు గట్టిగా నిలదీశారు. తలుపుల మండలం ఓదులపల్లిలో బుదవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ... ఇటీవల తాగునీటి సమస్య పరిష్కారానికి కొత్తగా బోరు బావి తవ్వించారని గుర్తు చేశారు. గ్రామానికి ఎగువన సుమారు 46 ఇళ్లకు పైప్‌లైన్ ఉన్నా తాగునీటిని వదలకుండా స్థానిక టీడీపీ నేత అడ్డుకుంటున్నాడని, వెళ్లి ప్రశ్నిస్తే దిక్కున్న చోటుకెళ్లి చెప్పుకోండి అంటూ బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో బోరు బావి వేసింది కేవలం టీడీపీ వాళ్ల కోసమేనా అని ప్రశ్నించారు. తాగునీటి అందించే వరకూ అక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించారు. దీంతో విషయాన్ని ఎంపీడీఓ నసీమా దృష్టికి సచివాలయ కార్యదర్శి ఉదయశ్రీ తీసుకెళ్లారు. వెంటనే ఎంపీడీఓ నసీమా ఓదులపల్లి గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. గురువారం నుంచి తాగునీటిని అన్ని ఇళ్లకు అందేలా చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ సచివాలయ కార్యదర్శిని ఆదేశించారు. తాగునీటి విషయంలో రాజకీయాలు తగదని టీడీపీ నేతలకు హితవు పలికారు.
సచివాలయ ఉద్యోగులను
నిలదీసిన మహిళలు


