వేడుకలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

వేడుకలకు వేళాయె..

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

వేడుకలకు వేళాయే..

ఓడీచెరువు/పుట్టపర్తి: ఉమ్మడి జిల్లాలోనే అతి పెద్ద ఉత్సవాలకు పేరొందిన అమడగూరు చౌడేశ్వరీదేవి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 850 సంవత్సరాల క్రితం అమరావతిగా పిలువబడిన అమడగూరులో వెలసిన చౌడేశ్వరీదేవి ఆలయానికి ఎంతో విశిష్ట చరిత్ర ఉంది. ‘కర్ణాటకకు చెందిన వడియార్‌ రాజులు వక్కల వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతంలో పర్యటించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో వారి ఒక్కగానొక్క పాప చౌడమ్మ కనిపించకుండా పోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో పాప వాక్కులు వినపడ్డాయి. చిన్నారిని ఆవహించిన తాను చౌడేశ్వరీదేవినని, తనకు ఇక్కడే ఆలయం కట్టి నిత్య పూజలు చేస్తూ ఉండాలని ఆదేశించింది. దీంతో ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు కొనసాగిస్తూ వస్తున్నట్లు పూర్వీకులు చెబుతున్నారు. కాగా, మరో కథనం ప్రకారం ఒకప్పుడు అమరావతి పట్టణాన్ని పాలిస్తున్న శ్రీరంగరాజు సంతానం కలగకపోవడంతో యజ్ఞయాగాదులు, దానధర్మాలు చేస్తూ వచ్చాడు. ఒక రోజు చౌడేశ్వరీ అమ్మవారు కలలో కనిపించి అమరావతికి (నేటి అమడగూరు) రెండు వైపులా రెండు చెరువులు తవ్వించి, ఆలయం నిర్మిస్తే సంతానం కలుగుతుందని చెప్పడంతో రాజు అలాగే చేశాడు. దీంతో రాజు కోరికలు నెరవేరాయి.’ అప్పటి నుంచి అమడగూరు చౌడేశ్వరీ ఆలయం దినదిన ప్రవర్ధనమానం చెందుతూ వచ్చింది.

అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఇలా...

ఏటా ఛైత్ర మాసంలో అమడగూరులో చౌడేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వివరాలను ఆలయ ధర్మకర్త పొట్టా పురుషోత్తంరెడ్డి మంగళవారం వెల్లడించారు. బుధవారం కుంభకూడుతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 2న ఊయల సేవ, 3న సూర్యప్రభ వాహన సేవ, 4న చంద్రప్రభ వాహన సేవ, 5న జ్యోతి ఉత్సవం, 6న అశ్వ వాహన సేవ, 7న సింహ వాహన సేవ, 8న హంస వాహన సేవ ఉంటుంది.

భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమడగూరు చౌడేశ్వరీదేవి

5న జ్యోతి ఉత్సవం

ఎనిమిది రోజుల పాటు

సాగనున్న ఉత్సవాలు

ఉత్సవాలకే తలమానికంగా..

అమ్మవారి ఉత్సవాలలో భాగంగా 5వ తేదీ నిర్వహించే జ్యోతి ఉత్సవానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఉత్సవాన్ని చూసేందుకు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలనుండి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఈ ఉత్సవాన్ని ఏటా ఎ.కొత్తపల్లికి చెందిన పొట్టా పురుషోత్తంరెడ్డి కుటుంబసభ్యులు నిర్వహిస్తూ వస్తున్నారు. స్వయంగా ఆలయ ధర్మకర్త ట్రాక్టర్‌ నడుపుతూ జ్యోతిని పురవీధులగుండా ఊరేగించేవారు. ఈ సారి రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన జిల్లాలోనే రెండవ అతిపెద్ద తేరు (కదిరి తర్వాత)పై జ్యోతిని ఊరేగించనున్నారు. ఉత్పవాలకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు, కాలక్షేపానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement