ఏసీబీ వలలో గుడిబండ తహసీల్దార్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో గుడిబండ తహసీల్దార్‌

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

మ్యుటేషన్‌ కోసం రూ.లక్ష డిమాండ్‌

రైతు నుంచి రూ.20 వేలు లంచం

తీసుకుంటుండగా పట్టుకున్న

ఏసీబీ అధికారులు

గుడిబండ: మ్యుటేషన్‌ కోసం ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ గుడిబండ తహసీల్దార్‌ శ్రీధర్‌ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి వివరాల మేరకు... గుడిబండ పరిధిలోని ఎస్‌.రాయాపురంకు చెందిన రైతు షేక్‌సద్దాం కొన్నేళ్లుగా పెనుకొండ మండలంలో ఉంటున్నారు. ఎస్‌.రాయాపురంలో తన పూర్వికుల ఆస్తి నాలుగు ఎకరాలు భూమి ఉండగా... ఆస్తి పంపకంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ ఆస్తి వివాదం పెనుకొండ ఆర్డీఓ కోర్టుకు చేరింది. కేసు విచారించిన ఆర్డీఓ కోర్టు ఎస్‌.రాయాపురంలోని నాలుగు ఎకరాల భూమిని షేక్‌సద్దాంకు మ్యుటేషన్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో షేక్‌సద్దాం కుమారుడు సద్దాంహుస్సేన్‌ ఆర్డీఓ కోర్టు ఆదేశాల ప్రకారం తమకు చెందాల్సిన నాలుగు ఎకరాల భూమికి పట్టాదారు పాసుబుక్‌ చేసి ఇవ్వాలని తహసీల్దార్‌ శ్రీధర్‌ను కోరారు. అయితే నెలలుగా తిరుగుతున్నా తహసీల్దార్‌ పట్టించుకోలేదు. మధ్యవర్తుల ద్వారా సంప్రదించగా తహసీల్దారు శ్రీధర్‌ రూ.లక్ష డిమాండ్‌ చేశారు. అయితే లంచం ఇవ్వడం ఇష్టలేని సద్దాంహుస్సేన్‌ ఏసీబీ అధికారులను సంప్రదించారు. వారి సూచన మేరకు తొలుత రూ.20 వేలు ఇస్తానని తహసీల్దార్‌కు తెలిపి మంగళవారం ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బుతో కార్యాలయానికి వెళ్లాడు. అనంతరం తహసీల్దార్‌ శ్రీధర్‌కు రూ.20 వేలు ఇస్తుండగా... అక్కడ కాపుకాసిన ఏసీబీ అధికారులు తహసీల్దార్‌ శ్రీధర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వెంటనే పంచనామా పూర్తి చేశారు. తహసీల్దార్‌ను కర్నూలు ఏసీబీ కోర్టు ఎదురు హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ హమీద్‌ఖాన్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement