గుత్తి రూరల్: అనుమానం పెనుభూతం కాగా, భర్త చేతిలో ఓ భార్య హతమైంది. పోలీసులు తెలిపిన మేరకు... అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన శివలింగయ్యకు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కట్టేకల్లు గ్రామానికి చెందిన కొటేలీ లక్ష్మి(45)తో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రెండు నెలలుగా శివలింగయ్య పిచ్చిపిచ్చిగా వ్యవహరిస్తూ జులాయిగా తిరగసాగాడు. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానాలు పెంచుకుని ఆమెతో తరచూ గొడవ పడేవాడు. పలుమార్లు హత్యాయత్నం కూడా చేశాడు. దీంతో గుంతకల్లు మండలం గొల్లలదొడ్డిలో ఉంటున్న పెద్ద కుమార్తె శ్రీవిద్య తన తల్లిని పిలుచుకెళ్లి రక్షణ కల్పిస్తూ వచ్చింది. ఈ నెల 29న శివలింగయ్య గొల్లలదొడ్డికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలుచుకుని గుంతకల్లు మండలం కదిరిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు.
జాతరకు వెళదామంటూ...
శివలింగయ్య, లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె స్పందనకు కర్ణాటకలోని బళ్లారికి చెందిన యువకుడితో ఈ నెల 11, 12న వివాహం జరిగేలా నిశ్చయించారు. ఈ క్రమంలో పెళ్లికి ముందు వరుడి ఇంట ఆచారం మేరకు మంగళవారం బళ్లారిలోని దుర్గమ్మ ఆలయంలో జాతరకు ఏర్పాట్లు చేశారు. వియ్యంకుల ఆహ్వానం మేరకు శివలింగయ్య కదిరిపల్లికి వెళ్లి తన భార్య లక్ష్మిని పిలుచుకుని గొల్లలదొడ్డిలో ఉన్న పెద్ద అల్లుడు మురళీకృష్ణ, మరో బంధువుతో కలిసి బళ్లారికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో మురళీకృష్ణను తప్పించి పూలకుంట గ్రామ శివారున మూతపడిన కంకర క్రషర్ యూనిట్ వద్దకు భార్యను పిలుచుకెళ్లి పై నుంచి కిందకు తోసేశాడు. ఈలోపు గుంతకల్లుకు చేరుకున్న మురళీ కృష్ణ తన మామకు ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేయకపోవడంతో మరోసారి కాల్ చేశాడు. ఆ సమయంలో లక్ష్మి ఫోన్ ఎత్తి మాట్లాడుతూ... తనను ప్రాంతానికి తీసుకొచ్చి చంపే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పబోతుండగా ఫోన్‌ను శివలింగయ్య లాక్కొని కట్ చేశాడు. అనంతరం బండరాళ్లను ఆమె తలపై వేసి హతమార్చాడు.
పొంతన లేని సమాధానాలు
ఫోన్ కట్ కావడంతో అనుమానం వచ్చిన మురళీకృష్ణ, బంధువులు వెంటనే చెర్లోపల్లి, పూలకుంట, తదితర ప్రాంతాల్లో గాలిస్తూ కదిరప్పస్వామి కొండ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో వారికి తారసపడిన శివలింగయ్యను ఆపి లక్ష్మి గురించి ఆరా తీశారు. ఆ సమయంలో పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో దేహశుద్ధి చేశారు. దీంతో పెద్ద అల్లుడుకి విషయం తెలిపి లక్ష్మిని హతమార్చిన చోటుకు పిలుచుకెళ్లాడు. సమాచారం అందుకున్న విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
భార్యను హతమార్చిన భర్త
పోలీసుల అదుపులో నిందితుడు


