ఓట్ల కోసం విష ప్రచారమా? | - | Sakshi
Sakshi News home page

ఓట్ల కోసం విష ప్రచారమా?

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

ధర్మవరం: ఓట్ల కోసం విష ప్రచారం చేయడం దారుణమని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్‌ పట్టణాధ్యక్షుడుగా నియమితులైన బడన్నపల్లి నరసింహులు ఆధ్వర్యంలో స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను గజమాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. అసమానతలను దూరం చేసేందుకే రిజర్వేషన్లను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవన ప్రమాణాలు పెంచేలా రిజర్వేషన్లను అంబేడ్కర్‌ తీసుకు వచ్చారన్నారు. అయితే ఓట్ల కోసం కులాల పేరుతో విభజించి వివక్ష చూపడం దారుణమన్నారు. చివరకు ఓట్ల కోసం ఆహార అలవాట్లపై కూడా విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాలు కల్తీతో రాజమండ్రిలో 15మంది చనిపోతే ఎందుకు జరిగిందనేది విచారణ కూడా చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు క్రీడా సంబారాల్లో మునిగి తేలారన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 64 మంది కల్తీ నీళ్లతో ఆస్పత్రి పాలైనా పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. మార్కాపురం వద్ద యాక్సిడెంట్‌ జరిగితే ఓ మహిళ 20 సార్లు ఫోన్‌ చేసినా 108 అంబులెన్స్‌కు కనెక్ట్‌ కాలేదన్నారు. ఫలితంగా 14మంది మృత్యువాత పడాల్సి వచ్చిందన్నారు. నల్లచెరువులో యాక్సిడెంట్‌ అయితే అంబులెన్స్‌ కదలక ఎస్‌ఐతో సహా దానిని ముందుకు తోయాల్సి వచ్చిందన్నారు. స్వచ్ఛమైన గాలి, తాగునీరు, మంచి చదువు, మంచి ఆరోగ్యం ఇచ్చేందుకు పాలకులు ప్రయత్నించాలి కానీ, దేవుడి పేరు చెప్పి ఓట్లు దండుకోవడం, రాజకీయాలు చేయడం, విధ్వేషాలు రగల్చడం సరికాదన్నారు. మతం మీద, కులం మీద రాజకీయం చేసేవారిని దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలని అనుకుంటారా అని ఎద్దేవా చేశారని, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా దేశం ఔన్నత్యానికి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా అన్ని మతాలు, కులాలను కలుపుకుని పోవాల్సిన లక్షణం లేని చంద్రబాబు ఎలా నాయకుడవుతాడని ప్రశ్నించారు. దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ఊరు కోసం పోరాడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సామాజిక న్యాయం అనే అంశం మీద ముందుకు వెళ్లిన ఏకై క పార్టీ వైఎస్సార్‌సీపీ అని గుర్తు చేశారు. కుల, మత విధ్వేషాల నుంచి బయటపడి ప్రగతివైపు ముందుకు వెళ్లేలా పాలకులు ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి చౌడప్ప, రూరల్‌ ఎస్సీ అధ్యక్షుడు రాంగోపాల్‌, మాజీ కౌన్సిలర్‌ గుజ్జల శివ, జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, కేశగాళ్ల రంజిత్‌కుమార్‌, సాకే విజయ్‌కుమార్‌, అజంతా కిష్ట, గరుడంపల్లి నారాయణస్వామి, రామాంజనేయులు, కేశగాళ్ల కృష్ణమూర్తి, అంజి, రాఘవ, భాస్కర్‌, మల్లి, నాగేంద్ర, తేజ, గంటాపురం దాము, రమేష్‌, బొమ్మన్న, బాబయ్య తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement