పుట్టపర్తి టౌన్: స్థానిక చిత్రావతి నది నుంచి సోమవారం అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టీడీపీ నేతలకు చెందిన మూడు ట్రాక్టర్లు, ఓ హిటాచీని పుట్టపర్తి అర్బన్ సీఐ తిమ్మారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం కేసు నమోదు చేసి, మైనింగ్ అధికారులకు అప్పగించడంతో జరిమానా విధించారు.
వ్యక్తి ఆత్మహత్య
తనకల్లు: మండలంలోని అగ్రహారం గ్రామానికి చెందిన నరసింహారెడ్డి (50) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో బాదపడుతున్న ఆయనకు ఇటీవల బెంగళూరులో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయినా వ్యాధి పూర్తిగా నయం కాకపోవడంతో రెండు రోజుల క్రితం చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. పరీక్షించిన వైధ్యులు క్యాన్సర్ గడ్డ తొలగించాల్సి ఉందన్నారు. దీంతో స్వగ్రామానికి వస్తూ మంగళవారం తెల్లవారుజామున మార్గమధ్యంలో బీటీ క్రాస్ వద్ద రైల్వే అండర్‌బ్రిడ్జి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నేడు రెవెన్యూ భవన్ ప్రారంభం
పుట్టపర్తి అర్బన్: మండలంలోని మామిళ్లకుంట క్రాస్ వద్ద సుమారు రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన రెవెన్యూ భవన్‌ను బుధవారం ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు సత్యప్రసాద్, సవిత, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి హాజరు కానున్నారు.
చంద్రబాబు వైఫల్యాలను
ప్రజల్లోకి తీసుకెళదాం
● వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి
మడకశిర రూరల్: చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలు, దళితులపై జరుగుతున్న దాడులు, వేధింపులను ప్రజల్లోకి తీసుకెళదామంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి రంగనాథ్‌తో కలసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్ తదితర పథకాలపై స్పష్టత లేకుండా పోయిందన్నారు. దళితుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందన్నారు. కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని గ్రామాల్లో పర్యటించి చంద్రబాబు ప్రభుత్వం దళితులకు చేస్తున్నా మోసాలను వివరిస్తామన్నారు.


