● మున్సిపల్ అధికారుల హెచ్చరిక
● చివరి రోజు రూ.80 లక్షల వసూలు
హిందూపురం: ఆస్తి పన్ను చెల్లించాలంటూ ఇన్ని రోజులుగా హిందూపురం మున్సిపల్ అధికారులు ప్రాధేయపడుతున్నా కొందరు స్పందించలేదు. పన్ను చెల్లింపులపై 50 శాతం వడ్డీ మాఫీని ప్రకటించారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. పన్నులు చెల్లించకపోతే మున్సిపల్ సేవలు నిలిపి వేస్తామంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారి విజయభారతి జారీ చేసిన నోటీసులు కూడా బేఖాతరయ్యాయి. మార్చితో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో బుధవారం ఆర్‌ఐలతో కలసి ఆర్‌ఓ విజయభారతి రంగంలో దిగారు. చివరి అస్త్రంగా ట్రాక్టర్ల నిండా చెత్త తీసుకెళ్లి పన్ను బకాయిదారుల గృహాలు, వాణిజ్య సముదాయల ఎదుట నిలిపి పన్ను చెల్లించకపోతే చెత్త డంప్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మంత్రం ఫలించింది. బకాయిదారులు ఆగమేఘాలపై స్పందించి పన్నులు చెల్లించేందుకు ముందుకు వచ్చారు. దీంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకూ అధికారులు పన్నులు కట్టించుకున్నారు. చివరి రోజు ఏకంగా రూ.80 లక్షల వరకు వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు.


