ధర్మవరం అర్బన్: ఈ నెల 11వ తేదీ వరకు జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా జరిగే 16వ జాతీయస్థాయి సబ్ జూనియర్ బాలికల హాకీ చాంపియన్‌షిప్ టోర్నీలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఏపీ జట్టులో ధర్మవరానికి చెందిన వైష్ణవి, నవ్య, శ్రీలేఖ, భవ్యకు చోటు దక్కింది. ఈ సందర్భంగా వారిని జిల్లా గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్, అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు ఉడుముల రామచంద్ర, గౌరీప్రసాద్, మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర, ట్రెజరర్ అంజన్న, జాయింట్ కార్యదర్శి అరవింద్ గౌడ్, జెన్నే చంద్రశేఖర్, డైరెక్టర్లు మారుతీప్రసాద్, ఇర్షాద్, అమీనుద్దీన్, కిరణ్, కోచ్ హస్సేన్ అభినందించారు.
ఉత్సాహంగా ఉట్ల పరుష
గాండ్లపెంట: విశ్వకవి యోగి వేమన బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉట్ల పరుష ఉత్సాహంగా సాగింది. ఆలయం ఎదుట ఇనుప స్తంభం ఏర్పాటు చేసి పై భాగాన కట్టిన ఉట్టిని అందుకునేందుకు పలువురు యువకులు పోటీ పడ్డారు. చివరకు మద్దివారిగొందికి చెందిన సాయికుమార్ బృందం విజయం సాధించింది. విజేతలను నిర్వాహకులు అభినందించారు. రాత్రి 9గంటలకు ఆగ్నిసేవ కార్యక్రమం నిర్వహించారు. కాగా, ఉత్సవాల్లో భాగంగా బుధవారం గొడుగుల మెరవణి, రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కేరళ ఛండ వాయిద్యం, కథాకళి నృత్య ప్రదర్శన, తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.


