కదిరి అర్బన్: హార్టికల్చర్‌కు సంబంధించి క్యాటిల్ షెడ్, నీటి తొట్టెలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో పెట్టొద్దని, వెంటనే చెల్లించాలని డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్ ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం స్థానిక డ్వామా కార్యాలయంలో కదిరి డివిజన్ పరిధిలోని ఐదు మండలాలకు సంబంధించిన ఉపాధి సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి 20 మందికి ఒక మేట్‌ను నియమించాలని, కూలీల సంఖ్య పెంచాలని సూచించారు. మే నుంచి వీబీ రామ్‌జీ పథకం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీడీ శకుంతల, ఏపీఓలు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు.
ఎలుగుబంటి హల్ చల్
మడకశిర రూరల్: మండల పరిధిలోని సిద్ధిగిరి, గుండుమల ప్రధాన రోడ్డులో శుక్రవారం ఎలుగు బంటి హల్ చల్ చేసింది. ఉదయం ఎలుగు బంటి రోడ్డు దాటుతున్న సమయంలో గమనించిన ఆటోలో వెళ్తున్న కూలీలు కేకలు వేయడంతో పొలాల మీద పొదల్లోకి పరుగులు తీసింది. దీంతో రాత్రి సమయంలో వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లే రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని అటవీ ప్రాంతం నుంచి వన్యప్రాణులు పొలాల్లోకి రాకుండా చూడాలని కోరుతున్నారు.
‘పురం’లో నాకాబందీ
హిందూపురం: అసాంఘిక కార్యక్రమాల నియంత్రణతో పాటు డ్రగ్స్ నివారణే లక్ష్యంగా శుక్రవారం తెల్లవారుజామున హిందూపురంలో పోలీసులు నాకాబందీ చేపట్టారు. ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాలతో అహమ్మద్ కాలనీలో డీఎస్పీ కేవీ మహేష్ నేతృత్వంలో సీఐలు రాజగోపాలనాయుడు, ఆంజనేయులు, అబ్దుల్‌కరీం ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక బృందాలుగా విడిపోయి అనుమానితుల గృహాలతో పాటు బయలు ప్రదేశాలు, ఖాళీ భవనాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. రికార్డులు సక్రమంగా లేని 37 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేశారు. రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్య పరిచారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.
30న ఉద్యోగ మేళా
అనంతపురం అగ్రికల్చర్: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో ఈ నెల 30న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10 పాస్ నుంచి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీ–టెక్ కోర్సుల్లో పాస్ , ఫెయిల్ అయిన యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. 12 కంపెనీల ద్వారా 500 వరకు ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. 30న సోమవారం ఆర్డీటీ స్టేడియం ఎదురుగా, ఉప్పరపల్లి రోడ్డులో ఉన్న ఎకాలజీ సెంటర్‌లో హాజరు కావాలని సూచించారు.


