హిందూపురం: ఒకట్రెండు కాదు... ఏకంగా 1,200 ఏళ్ల నాటి సూర్యదేవుడి విగ్రహం సోమవారం హిందూపురం మండలం కిరికెర గ్రామంలో లభ్యమైంది. శిల్పం పక్కనే ప్రాచీన శిలా శాసనాలు, శివలింగం, నంది, వినాయకుడి ప్రతిమలు ఉన్నాయి. వీటిని చరిత్రకారుడు బుక్కపట్నం గోపి గుర్తించి, వివరాలు వెల్లడించారు. విగ్రహాలు, శాసనాలు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కోలార్, తలకాఢ్ రాజధానులుగా చేసుకుని దక్షిణ కర్ణాటకను పాలించిన గంగ వంశరాజుల కాలం నాటివని తెలిపారు. శిల్పం లభ్యమైన ప్రాంతంలో 8వ శతాబ్దంలో సూర్యదేవర ఆలయం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. అరుదైన సూర్య దేవుడి విగ్రహం ఎలాంటి రక్షణ లేకుండా పడి ఉండడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా పురావస్తు శాఖ అధికారులు స్పందించి దేశ చరిత్ర, సంస్కృతిని భావితరాలకు అందజేయాలని కోరారు.


