పెనుకొండ రూరల్: విహార యాత్ర కాస్త విషాదంగా ముగిసింది. స్నేహితులతో కలసి గొల్లపల్లి రిజర్వాయర్‌కు చేరుకున్న ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... మణిపూర్‌లోని ఉక్రూల్ జిల్లా చోయ్‌థార్ గ్రామానికి చెందిన ఖరియ్ అహుంగ్‌షీ ఫిలిమెన్ (25) బెంగళూరులోని ఓ సెలూన్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో స్నేహితులతో కలసి సోమవారం విహార యాత్రలో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్‌కు వచ్చాడు. స్నేహితులందరూ కలసి రిజర్వాయర్‌లో దిగి నీటిలో కేరింతలు కొడుతుండగా ప్రమాదవశాత్తు ఫిలిమెన్ లోతైన ప్రాంతంలోకి వెళ్లాడు. ఈత సరిగా రాకపోవడంతో నీట మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు స్థానికుల సాయంతో గాలింపు చేపట్టి వెలికి తీసేలోపు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కియా పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
రిజర్వాయర్‌లో నీట మునిగి యువకుడి మృతి


